బడ్జెట్: TCS తగ్గింపు, ITR గడువుల పొడిగింపు..
x

బడ్జెట్: TCS తగ్గింపు, ITR గడువుల పొడిగింపు..

‘పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, వివాదాలను తగ్గించడం, వ్యక్తులు-వ్యాపారాలు-ఎన్నారైలకు సౌలభ్యం కల్పించడమే ప్రధాన లక్ష్యం’ - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


Click the Play button to hear this message in audio format

కేంద్ర బడ్జెట్(Budget) 2026–27లో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, వివాదాలను తగ్గించడం, వ్యక్తులు-వ్యాపారాలు-ఎన్నారైలకు సౌలభ్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంమని ప్రభుత్వం పేర్కొంది.


ITR గడువు పొడగింపు..

ఆదాయపు పన్ను రిటర్న్‌ల విషయంలో పన్ను చెల్లింపుదారులకు అదనపు సమయం ఇచ్చారు. సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. ఇది స్వల్ప రుసుముకు లోబడి ఉంటుంది. అలాగే రిటర్న్ ఫైలింగ్ షెడ్యూల్‌ను విభజించారు.


ITR-1, ITR-2 వ్యక్తులు – జూలై 31 వరకు

ఆడిట్ కాని వ్యాపారాలు, ట్రస్టులు – ఆగస్టు 31 వరకు

దీంతో చివరి రోజుల్లో ఉండే రద్దీ తగ్గి, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS తగ్గింపు..

సరళీకృత చెల్లింపుల పథకంలో భాగంగా విదేశీ టూర్ ప్యాకేజీలపై వసూలు చేసే TCSను 5%, 20% నుంచి 2%కు తగ్గించారు. విద్య, వైద్య ప్రయోజనాల కోసం చేసే చెల్లింపులపై కూడా TCSను 5% నుంచి 2%కు తగ్గించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఉపశమనం.


NRIల కోసం..

ఎన్నారైలు ఆస్తి అమ్మకాల సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఇకపై స్థిరాస్తి విక్రయాలపై TDSను కొనుగోలుదారుడే కట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా ట్యాన్ నంబర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఊహాజనిత పద్ధతిలో పన్ను చెల్లించే ప్రవాసులకు కనీస ప్రత్యామ్నాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు.


ఆదాయపు పన్ను చట్టం 2025 అమలు..

1961 నాటి పాత చట్టానికి బదులుగా కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఈ చట్టం పన్ను రేట్లను మార్చకుండా, చట్టంలోని విభాగాలను సగానికి తగ్గించి స్పష్టతను పెంచుతుంది. ఒకే “పన్ను సంవత్సరం” విధానాన్ని ప్రవేశపెట్టి, ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినా జరిమానా లేకుండా TDS రిఫండ్ పొందే అవకాశం కల్పించనున్నారు.


ఇతర కీలక నిర్ణయాలు..

ఐటీ సేవలకు సేఫ్ హార్బర్ పరిమితి రూ. 300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంపు..

మద్యం, స్క్రాప్, ఖనిజాలపై TCS 2%కు హేతుబద్ధీకరణ..

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అవార్డులు పన్ను నుంచి మినహాయింపు..

ఇంటర్ కోఆపరేటివ్ సొసైటీ డివిడెండ్లు మినహాయింపు..

చిన్న పన్ను చెల్లింపుదారులకు ఆటోమేటెడ్ నియమ ఆధారిత ప్రక్రియ ప్రవేశపెట్టడం..

అదనంగా, రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో రికార్డు స్థాయిలో 41% వికేంద్రీకరణను ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. మొత్తం మీద ఈ బడ్జెట్ పన్ను వ్యవస్థను సులభతరం చేసి, పారదర్శకతను పెంచే దిశగా అడుగులు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story