Ambati Rambabu
x
గుంటూరులో పోలీసులతో వాగ్వాదం చేస్తున్న అంబటి రాంబాబు

అంబటి అరెస్ట్ కు అసలు కారణం ఏమిటీ?

రాజకీయాల్లో బూతులు వ్యూహంగా మారాయా? చట్టం అమలులో సమానత్వం లోపించిందా?


వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ కక్ష, వివక్ష అంశాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇదే తరహా వ్యాఖ్యలు గతంలో చేసిన కొడాలి నానీ, వల్లభనేని వంశీ, రోజా వంటి నేతలపై ఎలాంటి చర్యలు లేకపోయినా, అంబటినే అరెస్ట్ చేయడం చట్ట అమలులో సమానత్వం ఉందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇది పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్న ఉదాహరణా, లేక ప్రతిపక్షమే టార్గెట్ గా చేపడుతున్న చర్యలా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

అంబటి రాంబాబు అరెస్ట్ – వివాదానికి కారణం ఏమిటి?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ ఆరోపణలను సమర్థించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది.

చార్జిషీట్‌లో గొడ్డు కొవ్వు వాడినట్టు నిర్ధారణ కాకపోయినా, వెజిటబుల్ ఆయిల్స్ ద్వారా కల్తీ జరిగినట్టు పేర్కొనడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. గుంటూరులో జరిగిన ఒక ఘటనలో అంబటి రాంబాబు, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుమారుణ్ణి అసభ్య పదజాలంతో దూషించిన వీడియోలు బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిని, కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. పోలీసులు నిన్న అర్థరాత్రి దాటాక అంబటి రాంబాబు అరెస్ట్ చేశారు.

రాజకీయాల్లో బూతులు – వ్యూహంగా మారాయా?

గత దశాబ్ద కాలంగా ఏపీ రాజకీయాల్లో భాషా సంస్కృతి తీవ్రంగా దిగజారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ జరిగితే, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, బూతులు రాజకీయ ఆయుధాలుగా మారాయి. పచ్చి బూతులు మాట్లాడటమే ఒక రకమైన “రాజకీయ ధైర్యం”గా ప్రచారం పొందుతోంది.
పోలీసుల సమక్షంలోనే నేతలు అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యవస్థల పట్ల వారికి భయం లేదన్న భావనను బలపరుస్తోంది. ఈ దూషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కార్యకర్తలను రెచ్చగొట్టి క్షేత్రస్థాయిలో హింసకు దారితీస్తోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

కొడాలి నానీ, వంశీ, రోజా – అప్పట్లో ఎందుకు చర్యలు లేవు?

అంబటి రాంబాబు అరెస్ట్‌పై ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. గతంలో చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నానీ, వల్లభనేని వంశీ, రోజా వంటి నేతలపై అప్పట్లో పోలీసులు ఎందుకు ఇదే తరహా చర్యలు తీసుకోలేదన్నది ఓ వర్గం వాదన.
ఒకే రకమైన వ్యాఖ్యలకు వేర్వేరు ప్రమాణాలు వర్తిస్తున్నాయా? అధికారంలో ఉన్నవారికి ఒక చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టమా? అన్న అనుమానాలు ఈ అరెస్టుతో మరింత బలపడ్డాయి. వైసీపీ నేతలు దీనిని నేరుగా “కక్ష సాధింపు రాజకీయం” గా అభివర్ణిస్తున్నారు.
కులం రంగు – వివక్ష ఆరోపణలకు బలం?
ఈ అరెస్టుకు కులం రంగు పులమడం కూడా రాజకీయంగా కీలకంగా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేశారంటూ కాపునాడు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఒక వ్యక్తిపై తీసుకున్న చట్టపరమైన చర్యగా కాకుండా, ఒక సామాజిక వర్గంపై జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గుంటూరుకు చెందిన సామాజిక విశ్లేషకుడు వి. శౌరయ్య ప్రకారం, ఇది కుల గౌరవం కోసం చేసే పోరాటం కాదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్న ఉదాహరణ మాత్రమే. ఏ చిన్న రాజకీయ ఘటనకైనా కుల కోణం జోడించడం ఏపీ రాజకీయాల్లో శాపంగా మారిందన్న విమర్శలు పెరుగుతున్నాయి.

చట్ట అమలా? లేక రాజకీయ కక్ష, వివక్షా?

తెలుగుదేశం, జనసేన కూటమి నేతలు మాత్రం ఈ అరెస్టును సమర్థిస్తున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను వ్యక్తిగతంగా దూషించడం నేరమని, చట్టం తన పని తాను చేస్తోందని వారు వాదిస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన దూషణలకు ఇప్పుడు చట్టబద్ధమైన సమాధానం ఇస్తున్నామన్నది వారి వాదన.
అయితే రాజకీయ విశ్లేషకుడు మల్లెల శేషగిరిరావు అభిప్రాయం ప్రకారం, ప్రజాస్వామ్యంలో విమర్శ పదునుగా ఉండొచ్చు కానీ అవమానకరంగా ఉండకూడదు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నది ప్రజల సంక్షేమం కోసం జరిగే మేధోమథనం కంటే, అధికార బలం–అహంకారం మధ్య యుద్ధంలా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉనికి కోసం పోరాటం, అధికార అహంకారం

ప్రస్తుత రాజకీయ తీరుకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది – ఉనికి కోసం పోరాటం. మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ కావాలన్న ఆతృతలో నేతలు మర్యాదపూర్వక విమర్శను పక్కన పెట్టి బూతుల బాట పడుతున్నారు. దీని ద్వారా తమ పార్టీ అధిష్టానం దృష్టిలో “ఫైటర్”గా నిలవాలన్న ప్రయత్నం చేస్తున్నారు.
రెండోది – అధికార యావ, అహంకారం. అధికారంలో ఉన్నప్పుడు “మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు” అన్న భావన, అధికారం కోల్పోయినప్పుడు “ఎలాగైనా తిరిగి అధికారాన్ని సాధించాలి” అన్న తపన నాయకులను విచక్షణ కోల్పోయేలా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
కొడాలి నానీ, వంశీ- అధికార పార్టీలోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లే వదిలేసి అంబటినే అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష, వివక్ష ఆరోపణలకు బలం చేకూరుస్తోందని కాపు సామాజిక వర్గ నేతలు గుంటూరు రాంబాబు లాంటి వాళ్లు ఆరోపించారు.. చట్టం అందరికీ సమానంగా వర్తించనప్పుడు ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. రాజకీయ లాభాల కోసం బూతులు, కులం, వివక్షను ఆయుధాలుగా మార్చడం రాష్ట్ర రాజకీయాలకు దీర్ఘకాలిక ప్రమాదంగా మారుతుంది.
ఇది నిజంగా చట్ట అమలా? లేక రాజకీయ కక్ష, వివక్షకు ఉదాహరణా?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే కాకుండా, ఓటర్లదీ కూడా.
Read More
Next Story