
పార్టీ కార్యక్రమాలకు ఎంపీ మహేష్ ను దూరం పెట్టిన సీఎం బాబు
ఒకవైపు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంటో పార్టీ ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు తెలుగుదేశం పార్టీ (TDP)లో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన ఘటనలో ఎంపీ మహేష్ డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ అయినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో TDP అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేష్‌కు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసుపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని కూడా పల్లాను ఆదేశించారు.
డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత తప్పుల వల్ల పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి రానివ్వనని ఆయన హెచ్చరించారు. ఈ ఆరోపణలు TDP ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయని, పార్టీలోని నేతలు కూడా ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని అధినాయకత్వం సూచిస్తోంది.
ఈ ఘటన బయటపడిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) TDPపై విరుచుకుపడుతోంది. TDP ఎంపీని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని YSRCP డిమాండ్ చేస్తోంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసు TDP యొక్క "సే నో టు డ్రగ్స్ బ్రో" క్యాంపెయిన్‌కు వ్యతిరేకంగా ఉందని YSRCP నేతలు విమర్శిస్తున్నారు.
పుట్టా మహేష్ యాదవ్ TDPలో కీలక నేతగా ఉన్నారు. ఆయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యేగా, ముందు TDP పాలనలో TTD చైర్మన్‌గా పనిచేశారు. ఎంపీ మహేష్ నారా లోకేష్‌కు దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పబడుతోంది. ఈ ఆరోపణలు రాజకీయ వివాదాన్ని రేపుతున్నాయి. TDP అధిష్టానం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని మలుపులు తీసుకురావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. TDP ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి పెట్టిన నేపథ్యంలో, సొంత పార్టీ సభ్యుడిపై వచ్చిన ఆరోపణలు పార్టీకి సవాలుగా మారాయి.

