పాదయాత్రలో బాబుకి సినిమా చూపిస్తా: జగన్‌
x

పాదయాత్రలో బాబుకి సినిమా చూపిస్తా: జగన్‌

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.


తన పాదయాత్రలో సీఎం చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి పాలనపైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్న ఏకైక సిద్ధాంతంతో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.

వచ్చే ఏడాదే పాదయాత్ర.. సినిమా చూపిస్తాం
వచ్చే ఏడాది తాను జనంలోకి వస్తున్నట్లు జగన్ ప్రకటించారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ప్రారంభమవుతుంది. నేరుగా ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటాను. నా యాత్ర మొదలైన తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
సూపర్ సిక్స్ మోసాలు.. తిరోగమనంలో రాష్ట్రం
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనని జగన్ విమర్శించారు. చంద్రబాబు తెచ్చిన మేనిఫెస్టో ఇప్పటికే చెత్తబుట్టలోకి వెళ్లిపోయిందని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలన్నీ అతిపెద్ద మోసాలుగా తేలిపోయాయని మండిపడ్డారు. తమ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను చంద్రబాబు రద్దు చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారని, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుల లెక్కలు.. ఎవరి జేబుల్లోకి సొమ్ము
రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని జగన్ గణాంకాలతో తిప్పికొట్టారు. మా పాలనలో రూ. 3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ. 2.73 లక్షల కోట్లను నేరుగా డీబీటీ (DBT) ద్వారా ప్రజల ఖాతాల్లోకే జమ చేశాం. కానీ, చంద్రబాబు కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇంత భారీ మొత్తంలో తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని ఆయన నిలదీశారు. తన హయాంలో పేదలకు మేలు జరిగితే, చంద్రబాబు హయాంలో కేవలం దోపిడీ మాత్రమే జరుగుతోందని జగన్ ఆరోపించారు.
Read More
Next Story