
మండలిలో లడ్డూ రాజకీయం..అపవిత్రతపై పరస్పర విమర్శలు
చర్చకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ధ్వజమెత్తింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ అల్లుకున్న రాజకీయం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర దుమారం రేపింది. అపవిత్రతకు కారణం మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి సభ్యులు పరస్పరం ధ్వజమెత్తారు. ఒకవైపు చంద్రబాబు వ్యాపార సంస్థల లబ్ధి కోసం దేవుడిపై నిందలు వేస్తున్నారని వైసీపీ మండిపడగా.. దేవుడి ఫోటోలను నిరసనలకు వాడుతూ హిందూ ధర్మాన్ని వైసీపీ అవమానిస్తోందని కూటమి మంత్రులు నిప్పులు చెరిగారు.
చర్చకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్: బొత్స ధ్వజం
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సభలో కీలకమైన అంశాలపై చర్చ జరగకుండా ప్రభుత్వం కావాలనే 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని ఆయన మండిపడ్డారు.
వ్యాపార ప్రయోజనాల కోసమే అబద్ధాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమే దేవదేవుడి ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టారని బొత్స ఆరోపించారు. తన సొంత సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవాలనే దుర్భుద్ధితోనే, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. స్వామివారి పవిత్రత కంటే బాబుకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమైపోయాయని విమర్శించారు.
ఇందాపూర్ గుట్టు రట్టు కావాల్సిందే..
గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలడంతో బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన ఇందాపూర్ డెయిరీని, కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ ఎందుకు వెనకేసుకొస్తున్నారని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ నుండి తప్పించి, పాత ట్యాంకర్లనే మళ్లీ వినియోగించుకునేలా చక్రం తిప్పారని ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీకి, సీఎం కుటుంబ సంస్థకు ఉన్న ఆర్థిక సంబంధాలపై సభలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మంత్రులా? లేక కంపెనీ డైరెక్టర్లా?
సభలో ప్రైవేట్ సంస్థల అక్రమాల గురించి తాము మాట్లాడుతుంటే.. మంత్రులందరూ ఎందుకు అంతగా ఉలిక్కిపడుతున్నారని బొత్స ఎద్దేవా చేశారు. మీరు ప్రజల తరపున పనిచేస్తున్న మంత్రులా? లేక ఆ ప్రైవేట్ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారా? అని నిలదీశారు. ప్రభుత్వం నడుపుతున్నారో లేక చంద్రబాబు వ్యాపార సంస్థకు సంబంధించిన కంపెనీని నడుపుతున్నారో అర్థం కావడం లేదని, పదేపదే ప్రైవేట్ సంస్థల తరపున వకాల్తా పుచ్చుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
చెప్పులతో దేవుడి ఫోటోలా? మంత్రుల ఆగ్రహం
శాసనమండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన నిరసన తీరుపై కూటమి సభ్యులు నిప్పులు చెరిగారు. సభలో దేవుడి ఫోటోలు పట్టుకుని ఆందోళన చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, గొట్టిపాటి రవి, రామానాయుడు తదితరులు ఛైర్మన్ చాంబర్ వద్ద భారీ నిరసన చేపట్టారు. భక్తుల ఆరాధ్యదైవాన్ని రాజకీయాల్లోకి లాగడంపై వారు భగ్గుమన్నారు.
బూట్లతో దేవుడి ఫోటోలు.. ఇది అక్షరాలా మహాపచారం
చెప్పులు, బూట్లు వేసుకుని సభలో వేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకోవడం అక్షరాలా మహాపచారం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యుల తీరు హిందూ మతాన్ని అవమానించేలా ఉందని, దేవుడి పట్ల వారికి కనీస గౌరవం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్సీలు హద్దులు దాటి ప్రవర్తించారని, ఇలాంటి అపవిత్రమైన చర్యలను ప్రజాస్వామ్య దేవాలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
బహిరంగ క్షమాపణకు డిమాండ్
శ్రీవారి పవిత్రతను దెబ్బతీస్తూ, కోట్లాది మంది హిందూ సమాజం మనోభావాలను గాయపరిచినందుకు వైసీపీ సభ్యులు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. కేవలం క్షమాపణలతో సరిపెట్టకుండా, చేసిన తప్పుకు లెంపలు వేసుకోవాలని వారు పట్టుబట్టారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి ఘటనలపై కౌన్సిల్ ఛైర్మన్ కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు విన్నవించారు.
మాకు దేవుడంటే భయం ఉంది.. బూట్లు వేసింది వాళ్లే
కూటమి నేతల ఆరోపణలను బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మేము బూట్లు వేసుకుని ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి. కెమెరాలు ఉన్నాయిగా.. ఆధారాలు చూపండి. చంద్రబాబు లాగా మేము బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకోలేదు. మాకు దేవుడంటే విశ్వాసం ఉంది. కేవలం ఇందాపూర్ లింకులపై చర్చను దారి మళ్లించడానికే కూటమి నేతలు ఈ డ్రామాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు. అటు లడ్డూ వివాదం, ఇటు సభలో నిరసనల తీరుతో ఏపీ శాసనమండలి వేదికగా అపవిత్రతపై సాగిన పరస్పర విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి.

