
జగన్ వస్తే లోకేష్ చూపిస్తాడట
మాజీ సీఎం వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ బంబర్ ఆఫర్.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అసెంబ్లీ సీట్ల కంటే స్టేడియం టికెట్లపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శల బాణాలు విసురుకున్న మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు క్రికెట్ మైదానంలోకి చేరారు. లోకేష్ విదేశాలకు వెళ్లి మ్యాచ్ చూడటంపై జగన్ చేసిన సెటైర్లకు, లోకేష్ అంతే వేగంగా రివర్స్ బౌన్సర్ విసిరారు. మ్యాచ్ చూడటానికి టీవీ లేదా? అని అడిగిన జగన్‌కు.. మీరు వస్తానంటే టికెట్ నేనే కొనిస్తా.. నేరుగా స్టేడియంలోనే మ్యాచ్ చూపిస్తా అంటూ లోకేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పులివెందుల ఎమ్మెల్యేను ఉద్దేశించి లోకేష్ విసిరిన ఈ టికెట్ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సిక్సర్‌లా వైరల్ అవుతోంది.
లోకేష్ కు ఇంట్లో టీవీ లేదా? కొలంబో వెళ్లి చూడాలా?
క్రికెట్ మ్యాచ్ చూడటానికి లోకేష్ కు ఇంట్లో టీవీ లేదా? రూ. 25 లక్షలు ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు వేసుకుని కొలంబో వెళ్లి మ్యాచ్ చూడాలా? అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ సంధించిన సెటైర్లు ఏపీ రాజకీయాల్లో నవ్వులు పూయించడమే కాదు, పెద్ద చర్చకే దారితీశాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్‌లో లోకేష్ క్రికెట్ పర్యటనపై విరుచుకుపడ్డ జగన్.. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే, ఐటీ మంత్రికి విదేశాల్లో మ్యాచ్‌లు చూసే తీరిక ఎక్కడిది? అని ప్రశ్నించారు. మ్యాచ్ చూడాలనుకుంటే హాయిగా ఇంట్లో టీవీలో చూడొచ్చు కదా.. దానికి ప్రత్యేక విమానాలు వేసుకుని, హంగూ ఆర్భాటాలతో కొలంబో వరకు వెళ్లాలా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని ఇలా వినోదాల కోసం తగలేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా సైన్యం కూడా కొలంబో క్రికెట్ పేరిట పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలుపెట్టింది.
లోకేష్ కౌంటర్.. నా దుడ్లతో నేను వెళ్తే నీకేంటి జగన్?
జగన్ వేసిన టీవీ సెటైర్లకు లోకేష్ ఏమాత్రం తగ్గకుండా, దాదాపు పుష్ప సినిమా రేంజ్‌లో మాస్ రిప్లై ఇచ్చారు. ఫ్లైట్ టికెట్ నాది.. మ్యాచ్ టికెట్ నాది.. ఆఖరికి నేను తాగే కాఫీ కూడా నాదే. నా సొంత దుడ్లతో (డబ్బులతో) నేను వెళ్తే నీకేంటి జగన్? అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన వ్యక్తిగత పర్యటనను కూడా రాజకీయం చేయడం జగన్ సంకుచితత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. నీలాగా సొంత పనులకు ప్రభుత్వ విమానాలను వాడే అలవాటు మాకు లేదు అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు.
లేటెస్ట్ ట్విస్ట్.. జగన్ కోసం బంపర్ ఆఫర్
ఇక నేడు అసెంబ్లీ లాబీల్లో లోకేష్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అయితే పొలిటికల్ వర్గాల్లో సిక్సర్‌లా దూసుకెళ్లింది. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో మన టీమిండియా ఫైనల్‌కు చేరితే నేను మళ్ళీ స్టేడియంకు వెళ్తాను. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారికి కూడా లైవ్‌లో మ్యాచ్ చూడాలని అంతగా కోరిక ఉంటే చెప్పమనండి.. ఆయనకు కూడా టికెట్ నేనే కొనిస్తాను. నా పక్కనే కూర్చోబెట్టుకుని మరీ మ్యాచ్ చూపిస్తాను అంటూ సెటైర్లు వేశారు. అసెంబ్లీకి రమ్మంటే రాని జగన్.. కనీసం తన ఆఫర్ చూసైనా స్టేడియానికి వస్తారా అన్నట్లుగా లోకేష్ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి నో.. స్టేడియంకు వస్తారా?
లోకేష్ చేసిన ఈ టికెట్ ఛాలెంజ్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతూనే, తన వ్యక్తిగత హాబీలను టార్గెట్ చేయడం ఎంత హాస్యాస్పదమో లోకేష్ ఎత్తిచూపారు. తన పర్యటనపై విమర్శలు చేసే ముందు.. గత ఐదేళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్ వంటి సంస్థలు ప్రజాధనంతో ఎలా లబ్ధి పొందాయో గుర్తు చేసుకోవాలని చురకలంటించారు. మొత్తానికి ఈ క్రికెట్ - టికెట్ వార్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అసలైన వినోదాన్ని పంచుతోంది.
Next Story

