
మావిగన్..ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ: జగన్
అమరావతి ఒక దోపిడీ గని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని అంశంపై తమ పార్టీకున్న స్పష్టమైన విజన్‌ను మరోసారి వివరించారు.
చంద్రబాబుది దోపిడీ వ్యూహం
అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులను, ప్రజలను వంచిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. కాంట్రాక్టుల ద్వారా కమీషన్లు దండుకోవడానికే అమరావతిని తెరపైకి తెచ్చారు. ఇది ఒక అతిపెద్ద దోపిడీ గని అని ఆయన విమర్శించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ. 4,500 ఉంటే, అమరావతిలో రూ. 14,000 కట్టబెడుతున్నారని, ఇది పక్కా దోపిడీ కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్లాన్ ఏ, ప్లాన్ బీ (MAVIGUN)
రాజధాని సమస్యకు తాము ఆచరణాత్మక పరిష్కారాలు చూపినట్లు జగన్ పేర్కొన్నారు. ప్లాన్ ఏ కింద వికేంద్రీకరణ చెప్పామని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉండాలని తాము ప్రతిపాదించామన్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ వద్దనుకుంటే, దానికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బీ కింద మచిలీపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) ప్రాంతాలను కలిపి 110 కిలోమీటర్ల కారిడార్‌ను (MAVIGUN) అభివృద్ధి చేయాలని సూచించామన్నారు.
ఖర్చు తక్కువ.. ఫలితం ఎక్కువ
అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు వెచ్చించి ప్రజలపై భారం వేసే బదులు, అందులో కేవలం 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్ ప్రాంతంలో అద్భుతమైన సౌకర్యాలు కల్పించవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు నగరాలకు మచిలీపట్నం పోర్టును అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందని ఆయన ఉద్ఘాటించారు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతిని పట్టుకుని వేలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Next Story

