ఓట్ల యుద్ధం రేపే: కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటరు తీర్పు ఎటువైపు?
x

'ఓట్ల యుద్ధం' రేపే: కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటరు తీర్పు ఎటువైపు?

హ్యాట్రిక్ కోసం పినరయి విజయన్ (కేరళ), హిమంత (అస్సాం) హోరాహోరి, పుదుచ్ఛేరిలో పోటాపోటీ


దేశంలోని రెండు ప్రధాన రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి రేపు (ఏప్రిల్ 9, 2026) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడింటిలో రెండు దక్షిణాదిలో, ఒకటి ఈశాన్య భారతంలో ఉన్నాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 296 అసెంబ్లీ సీట్లకు (కేరళ-140, అస్సాం-126, పుదుచ్చేరి-30) పోలింగ్ జరుగనుంది. భారతదేశంలో మినీ యుద్ధంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో రేపు జరిగేది తొలి విడత పోలింగ్.

కేరళలో పినరయి విజయన్ 'హ్యాట్రిక్' కొడతారా?

కేరళలో మొత్తం 140 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇక్కడ అధికార ఎల్‌డీఎఫ్ (LDF), ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుని చరిత్ర సృష్టించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ భావిస్తున్నారు.

పదేళ్లలో అమలు చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు, సామాజిక భద్రతా పింఛన్లు ఎల్‌డీఎఫ్‌కు ప్రధాన బలం. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ పొందుతున్నాయి. "అభివృద్ధి కొనసాగాలి" అనే నినాదంతో విజయన్ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకుంటోంది. సంక్షేమ పథకాల పంపిణీలో క్రమబద్ధతను తమ విజయానికి కీలకంగా భావిస్తున్నారు.
ఐదేళ్ల సంప్రదాయంపై కాంగ్రెస్ ఆశలు..
కేరళలో సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 2021లో ఎల్‌డీఎఫ్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈసారి "ప్రభుత్వ వ్యతిరేకత" తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నమ్ముతోంది.
నిరుద్యోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. యువత, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చింది.
బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రయత్నం...
కేరళలోని త్రిసూర్, తిరువనంతపురం (నేమం, కజకూటం), పాలక్కాడ్ వంటి స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ రెండు ఒకే నాణేనికి రెండు ముఖాలని, తాము మాత్రమే ప్రత్యామ్నాయమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ, క్రైస్తవ ఓటు బ్యాంకులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు
రాష్ట్ర ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఆగకపోవడం ప్రభుత్వానికి లాభిస్తుందా? లేదా ఆర్థిక లోటుపై ప్రతిపక్షాల విమర్శలు పని చేస్తాయా? అనేది చూడాలి.
మలబార్ ప్రాంతంలో ముస్లిం లీగ్ పట్టు, సెంట్రల్ కేరళలో క్రైస్తవ వర్గాల ఓట్లు ఎటు పడితే ఆ కూటమిదే అధికారం. క్రైస్తవ వర్గాల్లో ఉన్న కొన్ని భయాలను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ 'క్రైస్తవ ఔట్రీచ్' ప్రోగ్రామ్ చేపట్టింది.
గోల్డ్ స్కామ్' వంటి పాత వివాదాలతో పాటు, శబరిమల ఆలయ నిర్వహణలో సంస్కరణల అంశం మళ్లీ ప్రచారంలోకి వచ్చింది.
ఏమి జరగవచ్చు...
ఈసారి కేరళలో గతంలో ఎన్నడూ లేని విధంగా త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని సర్వేలు ఎల్‌డీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యం ఇస్తుండగా, క్షేత్రస్థాయిలో యూడీఎఫ్ బలపడుతోందని మరికొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా తిరువనంతపురం, కొచ్చి వంటి పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల తీర్పు ఈసారి కొత్తగా ఉండే అవకాశం ఉంది.

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించేనా?

అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి విజయం సాధించాలని (హ్యాట్రిక్) పట్టుదలతో ఉంది. అస్సాంలో ఈసారి పోటీ ప్రధానంగా "అస్సామీ అస్తిత్వం", "అభివృద్ధి" అనే అంశాల చుట్టూ తిరుగుతోంది.
హిమంత బిశ్వ శర్మ 'వన్ మ్యాన్ షో'
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అస్సాంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం మరియు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. బరాక్ వ్యాలీలో ఈసారి 9 నుండి 11 స్థానాలు గెలుచుకుంటామని శర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90-100 స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగింది. హిందూ ఓటర్లను ఏకం చేసే 'అస్సామీ సంస్కృతి - అస్తిత్వ పరిరక్షణ' అనే నినాదం బీజేపీకి బలమైన ఆయుధంగా మారింది.
కాంగ్రెస్ గ్లోబల్ అలయన్స్ ప్రయత్నం...
ఈసారి కాంగ్రెస్ పార్టీ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో రాయ్ జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, లెఫ్ట్ పార్టీలతో కలిసి 'అసోం సమ్మిళిత మోర్చా'గా ఏర్పడింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే వీరి ప్రధాన లక్ష్యం.
రాష్ట్రంలో నిరుద్యోగం (సుమారు 23% ఓటర్ల ఆందోళన), అవినీతి, ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా యువతలో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవాలని చూస్తోంది.
గెలుపోటములను ప్రభావితం చేసే 'ఎక్స్-ఫ్యాక్టర్స్'
పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్‌ఆర్‌సీ (NRC) అంశాలు అస్సాంలో ఎప్పుడూ సెంటిమెంట్ పాయింట్లే. వీటిపై ఉన్న గందరగోళాన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుండగా, బీజేపీ మాత్రం చొరబాటుదారుల అంశాన్ని తెరపైకి తెస్తోంది.
బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని AIUDF ఒంటరిగా పోటీ చేయడం వల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్, AIUDF మధ్య చీలిపోయే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా బీజేపీకి లాభించే అంశం.
గౌహతీ వంటి నగరాల్లో మొదటిసారి ఓటు వేస్తున్న యువత అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక నిరుద్యోగంపై ఆగ్రహంతో ఉన్నారా అనేది ఫలితాలను శాసిస్తుంది.

అస్సాంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం బీజేపీకి కొంత ఆధిక్యం కనిపిస్తోంది. అయితే, గౌరవ్ గొగోయ్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. అస్సాంలో మొత్తం 126 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. అత్యధికంగా కోటీశ్వరులు (Crorepatis) పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో అస్సాం ముందు వరుసలో ఉండటం మరో విశేషం.

పుదుచ్చేరి: ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఏ కూటమీ కచ్చితంగా గెలుస్తుందన్న అంచనాలు కనిపించడం లేదు.

తమిళనాడు (234 స్థానాలు), పశ్చిమ బెంగాల్ (తొలి విడత 152 స్థానాలు) ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. రేపు జరగబోయే పోలింగ్ కేరళ, అస్సాం రాజకీయ భవిష్యత్తును తేల్చనుంది.
Read More
Next Story