చంద్రబాబు, పవన్ కల్యాణ్
x
చంద్రబాబుతో పవన్ భేటీ

చంద్రబాబు, పవన్ కల్యాణ్ 2.30 గంటల పాటు ఏమి చర్చించారంటే..

అసమ్మతీయులను దారికి తేవడం ఎలా? అనే దానిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య బుధవారం ఉదయం కీలక సమావేశం జరిగింది. సీఎం నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు సుమారు రెండున్నర గంటలపాటు భేటీ అయ్యారు. అంతసేపు వీళ్లు ఏమి చర్చించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలపై విపక్షం రెచ్చగొట్టే ప్రయత్నాలు, కూటమి సమన్వయం వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఏమి చర్చించారన్న విషయాన్ని వాళ్లిద్దరూ వెల్లడించలేదు.
అయితే మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రాధాన్యత పొందినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల భక్తులు ఉన్న నేపథ్యంలో, వారి మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం.
ఎన్‌డీడీబీ నివేదిక ఆధారంగా గతంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై స్పందించడం, విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసులు దాఖలవ్వడంతో, సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగుతోంది. సిట్ తన నివేదికను కేబినెట్ ముందు ఉంచగా, మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నెయ్యి కల్తీ జరిగినట్లు తేలడంతో, దీనికి అవకాశం కల్పించిన వారంతా బాధ్యులేనని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
‘కుల రాజకీయాల ట్రాప్‌లో పడొద్దు’
ఈ సమావేశంలో మరో ప్రధాన అంశం రాష్ట్ర రాజకీయాల్లో కుల ఉద్రిక్తతలను విపక్షం రెచ్చగొడుతోందన్న అంశం. వైసీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ కుట్రలు చేస్తోందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు–పవన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రత్యేకించి కిందిస్థాయిలో TDP–జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా విపక్షం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా సమన్వయం పెంచాలని నేతలు భావించినట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులపై ప్రాథమిక చర్చ
సమావేశంలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలపై కూడా ఇద్దరు నేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. అలాగే పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల జనసేనలో అసంతృప్తి, కార్యకర్తల ఆవేదన, బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా వంటి పరిణామాల నేపథ్యంలో, కూటమిలో సమతౌల్యం, పదవుల పంపకంపై స్పష్టత అవసరమన్న భావన బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు–పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయంగా భేటీ సంకేతం ఏమిటి?

లడ్డూ వివాదం, కుల రాజకీయాల ఆరోపణలు, కూటమి క్యాడర్‌లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు – ఇవన్నీ ఒకే సమయంలో తెరపైకి రావడంతో, ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ దిశగా అడుగులు వేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
చంద్రబాబు–పవన్ సమావేశం ద్వారా కూటమిలో సమన్వయం బలంగా ఉందన్న సందేశాన్ని ఇవ్వడంతో పాటు, విపక్షం చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read More
Next Story