నిషేధిత జాబితాలో భూములు ‘గీతం’కి బదలాయింపు!
x
ఈఏఎస్‌ శర్మ కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి,రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

నిషేధిత జాబితాలో భూములు ‘గీతం’కి బదలాయింపు!

విశాఖలోని గీతం యూనివర్సిటీకి బదలాయించిన, బదలాయించబోతున్న ప్రభుత్వ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ వెల్లడించారు.


గీతం విశ్వవిద్యాలయానికి గతంలో బదలాయించిన, ప్రస్తుతం బదలాయించడానికి ప్రతిపాదించిన భూముల్లో నిషేధిత ప్రభుత్వ భూములే గాక గతంలో టూరిజం వంటి ప్రభుత్వ శాఖలకు కేటాయించినవి కూడా ఉన్నాయని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఎఎస్‌ శర్మ పేర్కొన్నారు. ఈ విషయం అధికారులకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మికి లేఖలు రాశారు. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేయాలని కోరుతూ ఈ లేఖలు పంపారు. ఆ లేఖలో సారాంశం యధాతథంగా..

గీతం యూనివర్సిటీ కి ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా బదలాయించడంపై నేను మీకు 23.1.26, 25.1.26న లేఖలకు మీరు స్పందించలేదు. నేను ఇప్పుడు చూసిన వార్తల ప్రకారం.. జీవీఎంసీ సమావేశంలో గీతంకు ప్రభుత్వ భూములు బదలాయించడానికి జీవీఎంసీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకపక్షంగా ఆమోదించడం బాధాకరం. జిల్లా రెవిన్యూ అధికారులు గాని, జీవీఎంసీ గాని క్షుణ్ణంగా పరిశీలించకుండా గీతం ప్రతిపాదనను ఆమోదించినందుకు కింద సూచించిన కేసు నిదర్శనం.
జీవీఎంసీ ఆమోదించిన భూముల్లో ఎండాడ గ్రామంలో రిజిస్ట్రేషన్‌ శాఖ వారి నిషేధిత జాబితాలో చూపిన సర్వే నంబర్లు 19/1, 19/2, 119/9 కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో 16.7.25న రాష్ట్ర హైకోర్టు.. కె.సుందర రామరాజు వెర్సస్‌ ఏపీ ప్రభుత్వ కేసు (డబ్ల్యూపీ నం.8940/2017)లో ఇచ్చిన తీర్పులో ఈ కింది విధంగా ఎండడాడలో సర్వే నంబర్లు 19/1, 19/2, 19/9 ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. హైకోర్టు వారి తీర్పులో ప్రస్తావించిన అంశాల ఆధారంగాః
1. ఎండాడలో సర్వే నంబరు 19 (85 ఎకరాలు) కొండ పోరంబోకు భూమి, వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం కొండ పోరంబోకు భూమిలో కట్టడాలు నిషేధం. గీతంకు ఆ భూమిని ఇవ్వడానికి ఎలా అనుమతించారు?
2. నేను ముందు ప్రస్తావించిన జగ్‌పాల్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పోరంబోకు భూములను స్థానిక సంస్థలు ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని ఆదేశించింది. గీతం విషయంలో జీవీఎంసీ వ్యవహరించిన తీరు ఆ ఆదేశాలను ధిక్కరించినట్టయింది.
3. ఆ సర్వే నంబరులో 2.5 ఎకరాల భూమి విషయంలో 16.7.25న రాష్ట్ర హైకోర్టు కె.సుందర రామరాజు వెర్సస్‌ ఏపీ ప్రభుత్వం కేసులో ఇచ్చిన ఉత్తర్వు విషయం, తహసీల్దారు జీవీఎంసీకి పంపిన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు? రాజకీయ నేతల ఒత్తిడి కారణంగా గీతం ప్రతిపాదనను క్షుణ్ణంగా రెవిన్యూ అధికారులు పరిశీలించలేదని అర్థమవుతున్నది.
4. హైకోర్టు తీర్పులో ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లో 30.4.87 అంటే 38 ఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వే నంబరు 19లో, ప్రభుత్వంలో భాగమైన టూరిజం శాఖకు, 120 ఎకరాలను కేటాయించింది. దీనిపై తహసీల్దారు జీవీఎంసీకి పంపిన లేఖలో ఎందుకు ప్రస్తావిచలేదు? అంటే రాజకీయ నేతల ప్రమేయంతో తహసీల్దారు, గీతంకు ఎలాగోలా అంత పెద్ద విస్తీర్ణం, విలువ ఉన్న భూమిని భూ సంతర్పణలో భాగంగా, అతి తొందరగా లేఖ రాశారని స్పష్టమవుతున్నది.
5. విశాఖ రెవిన్యూ అధికారులు పాత రికార్డులు చూడకుండా కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయంపై, కోర్టు సూచించిన విధంగా విమర్శించడం జరిగింది. రాజకీయ నేతల ఒత్తిడి రాగానే విశాఖ రెవిన్యూ అధికారులు తమ బాధ్యతను విస్మరించి పని చేస్తున్నారని తెలుస్తున్నది.
6. నేను ముందు రాసిన లేఖల్లో గీతం ఆక్రమించిన భూముల్లో, గతంలో డీ పట్టా భూములు కూడా ఉండవచ్చని, అలాంటి భూములను ఆక్రమించడం నిషేధించబడిందని, దీనిపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశాను. అక్రమ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పెద్ద పేరుతో ఎలా క్రమబద్ధీకరణ చేయగలరు?
7. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు యాజమాన్యాలు అక్రమంగా ఆక్రమించి ఆ భూములను బ్యాంకులకు తాకట్టు› పెట్టి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని, స్వప్రయోజనాలకు ఉపయోగించడం ఆనవాయితీ అయింది. గీతం కూడా ఆ విధంగా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉంటే ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలి.
8. అంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన గీతం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థులకు కనీసం 20 శాతం సీట్లను రిజర్వు చేసి తక్కువ ఫీజు వసూలు చేయాలి. ప్రభుత్వం గీతంకు అటువంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదు?
9. ప్రభుత్వ భూముల విషయంలో విశాఖ రెవిన్యూ, జీవీఎంసీ అధికారులు వీధి వ్యాపారుల మీద, మురికివాడల ప్రజల మీద కర్కశంగా ప్రవర్తించడం, పెద్దల పట్ల ఈ విధంగా అత్యంత వ్యామోహం చూపించడం బాధాకరమైన విషయం. మానవత్వం ఉన్న అధికారులు ఆ విధంగా ప్రవర్తించరు.
నా ఉద్దేశంలో గీతం ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో రెవిన్యూ, జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై నిష్పాక్షికమైన దర్యాప్తు అవసరం. రాజకీయ నేతల ఒత్తడి కారణంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అలాంటి దర్యాప్తు చేయలేరు. ఆ కారణంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయడం అవసరం. వారికీ నేను ఈ లేఖను పంపిస్తున్నాను. బ్యాంకు రుణాల విషయంలో ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలి. అని ఈఏఎస్‌ శర్మ ఆ లేఖలో కోరారు.
Read More
Next Story