
వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కాంగ్రెస్ దారెటు?
ఒంటరిగా పోటీ చేస్తే ఎవరికి లాభం? రాష్ట్ర స్థాయి నాయకులేమంటున్నారు?
పశ్చిమ బెంగాల్(West Bengal)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కాంగ్రెస్ (Congress) పార్టీలో ఎన్నికల వ్యూహంపై గందరగోళం నెలకొంది. పార్టీ ఒంటరిగా పోటీ చేయాలా? లేక తృణమూల్ కాంగ్రెస్ (TMC) లేక సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకోవాలా? అనేది సందిగ్ధంగా ఉంది.
‘పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి..’
కాంగ్రెస్‌కు ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో, ముందుగా పార్టీని బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్‌లోని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేయాలని వారు కోరుతున్నారు. అయితే మరో వర్గం ముఖ్యంగా మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీ..వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడం మంచిదని భావిస్తున్నారు.
‘నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..’
కాగా పొత్తులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్ తెలిపారు. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యూహాత్మక సమావేశాలు జరగలేదని, త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. రాష్ట్ర యూనిట్‌లో ఒంటరిగా పోటీ చేయాలనే బలమైన అభిప్రాయం ఉన్నప్పటికీ, జాతీయ స్థాయి దృష్టికోణం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉండగా, మతతత్వ శక్తుల పెరుగుదలను అడ్డుకోవడం అన్ని పార్టీల బాధ్యత అని అన్నారు. ఓట్ల విభజన జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు.
ఇండియా కూటమిలో టీఎంసీ కూడా భాగస్వామి కావడంతో, కూటమిగా పోటీ చేసే నిర్ణయం వస్తే అది జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షులే తీసుకుంటారని మీర్ స్పష్టం చేశారు.
అన్ని స్థానాల్లోనూ..
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో కొందరు 294 అసెంబ్లీ స్థానాలన్నింటిలో పోటీ చేయాలని గట్టిగా వాదిస్తున్నారు. కనీసం పన్నెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నది వారి నమ్మకం. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్, మాల్డా, పశ్చిమ దినాజ్‌పూర్ జిల్లాల్లో పార్టీకి బలమైన స్థితి ఉందని వారంటున్నారు. సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తే ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ను ఎవరూ సవాలు చేయలేరని వారి అభిప్రాయం.
గత ఎన్నికల్లో సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఈ జిల్లాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిందని వారు గుర్తుచేస్తున్నారు. కూటముల కారణంగా గెలవగల సీట్లు కోల్పోవాల్సి వస్తుందని, గతంలో పొత్తులు పార్టీ రాజకీయ స్థలాన్ని కుదించాయని వారు భావిస్తున్నారు.
అయితే ముస్లిం ఓటర్ల విషయంలో కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. హుమాయున్ కబీర్ స్థాపించిన జనతా ఉన్నయన్ పార్టీ (జేయూపీ), అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM మధ్య పొత్తు ముస్లిం ఓట్లను విభజించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం లేదని, వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారనే విమర్శలు రావచ్చని ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.
ఒంటరిగా వద్దు..
ఇటీవల జరిగిన రాష్ట్ర యూనిట్ సమావేశాల్లో అధీర్ రంజన్ చౌదరి, ప్రదీప్ భట్టాచార్య, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ మన్నన్ వంటి నేతలు ఒంటరిగా పోటీ చేయడాన్ని వ్యతిరేకించారని సమాచారం. సౌత్ మాల్డా ఎంపీ ఇషా ఖాన్ చౌదరి కూడా సీపీఐ(ఎం)తో పొత్తుకు మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు.
అధీర్ రంజన్ చౌదరికి వామపక్ష పార్టీల పట్ల అనుకూల దృక్పథం ఉందని పార్టీ లోపల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీతో అనుబంధం ఉండటమే దీనికి కారణమని కొందరు నేతలు అంటున్నారు. అయితే ఈ విషయాలపై ఆయా నేతల నుంచి అధికారిక స్పందన రాలేదు.
మొత్తంగా చూస్తే, ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల విభజన జరిగి చివరికి బీజేపీ(BJP)కి లాభం కలిగే ప్రమాదం ఉందని కొందరు నాయకులు భావిస్తుండగా, టీఎంసీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయడం లేదు. కాంగ్రెస్‌లో ఎన్నికల వ్యూహంపై స్పష్టత కోసం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

