
మహారాష్ట్ర ఎన్‌సీపీ కొత్త డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్..
ఎన్‌సీపీ శాసనసభా నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక..
మహారాష్ట్ర(Maharashtra)లో కీలక రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్(Sunetra Pawar) ఎన్‌సీపీ(NCP) శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి(Deputy CM)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలో సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుందని అధికారికంగా వెల్లడించారు. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.
ఏకగ్రీవంగా..
ఎన్‌సీపీ శాసనసభా సమావేశంలో సీనియర్ నేత దిలీప్ వాల్సే పాటిల్ సునేత్ర పేరును ప్రతిపాదించగా, మంత్రి ఛగన్ భుజ్‌బల్ మద్దతు తెలిపారు. విధాన భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాజకీయ నేపథ్యం..
సునేత్రా పవార్‌కు కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, క్రియాశీల రాజకీయాల్లోకి ఆమె ఆలస్యంగా ప్రవేశించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినా, ఆ ఎన్నికల ప్రచారం ఆమెకు రాజకీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపరుచుకున్నారు. రాజ్యసభలో వ్యవసాయం, పశ్చిమ కనుమల పరిరక్షణ, రైల్వే ప్రాజెక్టులు, నాసిక్ కుంభమేళా ఏర్పాట్ల వంటి ప్రజా సమస్యలపై చురుకుగా ప్రశ్నలు లేవనెత్తుతూ తన పాత్రను చాటుకున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ..
1963లో ధారాశివ్ జిల్లాలో జన్మించిన సునేత్రా పవార్ తండ్రి బాజీరావు పాటిల్. ప్రాంతీయ నాయకుడు. ఔరంగాబాద్ ఎస్‌బీ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బారామతి హైటెక్ టెక్స్‌టైల్ పార్క్ వంటి పారిశ్రామిక కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు, మహిళా సాధికారత అంశాల్లో చురుకుగా వ్యవహరించారు.
సామాజిక సేవలోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్విరాన్‌మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టి, కటేవాడి గ్రామాన్ని పర్యావరణహిత గ్రామంగా చేయడంలో సహకరించారు. అలాగే, వేలాది విద్యార్థులకు సేవలందించే విద్యా ప్రతిష్ఠన్ సంస్థకు ట్రస్టీగా సేవలందిస్తున్నారు. రాజకీయాల్లో ఆలస్యంగా అడుగుపెట్టినా.. స్వల్ప కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానానికి ఎదగడం సునేత్రా పవార్ ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు.

