AP Cabinet meeting
x
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ మీటింగు

కల్తీ నెయ్యిపై బాబు క్యాబినెట్ సంచలన నిర్ణయం: విచారణ కమిషన్ ఏర్పాటు

ఆంధ్రా క్యాబినెట్ నిర్ణయం, దోషులను శిక్షించడానికా, రక్షించడానికా?


తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో, భక్తుల విశ్వాసంలో పెద్ద చర్చగా మారిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, ఈ వ్యవహారంపై మరోసారి విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ క్యాబినెట్ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) నిర్ణయించింది. ఈ నిర్ణయంతో “కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు కొత్త కమిషన్‌కు వెళ్లింది?” అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రధాన అజెండాగా మారింది. సిట్‌ సమర్పించిన నివేదిక, ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం మధ్య తేడాలు ఉన్నాయని మంత్రివర్గం గుర్తించింది. కేబినెట్ అభిప్రాయం ప్రకారం- సిట్ విచారణలో బయటపడ్డ వాస్తవాలు, ఛార్జ్‌షీట్‌లో నమోదు అయిన అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన వివరాల మధ్య “గ్యాప్” ఉందని భావిస్తోంది.
అందుకే “అసలు సూత్రధారులు ఎవరు?” అన్నది తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మళ్లీ కమిషన్ ఎందుకు?

ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ. సిట్ (Special Investigation Team) ఒక క్రిమినల్ విచారణ సంస్థ. దాని లక్ష్యం- నేరం జరిగిందా?, ఎవరు చేశారో ఆధారాలతో నిరూపించడం, కోర్టులో ఛార్జ్‌షీట్ వేయడం. సిట్ పని ప్రధానంగా ప్రాసిక్యూషన్ దిశగా ఉంటుంది.
కానీ ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే- సిట్ చర్యలు “పాత్రధారుల” వరకే పరిమితమయ్యాయని, అసలు దీని వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్ బయటపడలేదని.
ఈ వ్యవహారమై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏమన్నారంటే.."ఇదేదో కక్షపూరితమైన చర్య కాదు. నెయ్యి కల్తీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చడమే. భాగస్వామ్య పక్షాలందరూ వారి వారి వాదనలు వినిపిస్తారు."
క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆయన కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడారు. "ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామమందిరానికి కూడా కల్తీ లడ్డూలు సరఫరా చేయటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది మంత్రివర్గం. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధాలను గుర్తించేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. వైసీపీ హయాంలో 2022లో చేయించిన సీఆర్టీఐ నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది" అని చెప్పారు పయ్యావుల కేశవ్.

సిట్ ఛార్జ్‌షీట్- నేరస్థులపై కేసు..

సీబీఐ సిట్ అధికారులు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో - గొడ్డు కొవ్వు లాంటి పదార్థాలు కలవలేదు కాని నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ వంటివి కలిశాయి అని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీటీడీ, వైసీపీ మధ్య వాదోపవాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇప్పుడు తాజాగా ప్రభుత్వ వాదన ఏమిటంటే.. “విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు లేవు?” అనేది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఇదే.

"సిట్ విచారణలో- భారీగా కల్తీ నెయ్యి సరఫరా, జంతు కొవ్వు కలిసినట్టు నిర్ధారణ, ప్రమాదకర పదార్థాల మిశ్రమం, గత ప్రభుత్వ కాలంలో పెద్ద స్థాయిలో సరఫరా అయినట్టు తేలిందని ఇప్పుడా విషయాలను చార్జ్ షీట్ లో నమోదు చేయలేదని" క్యాబినెట్ అభిప్రాయపడింది.
ఇక్కడే ప్రభుత్వం “సిట్ సిఫార్సులు సరిపోవు” అని భావిస్తోంది.. “గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది” అన్న దిశగా ప్రభుత్వం చూస్తోంది. ఈ వ్యవహారాన్ని కేబినెట్ రాజకీయ కోణంలోనూ చూస్తోంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అసలు పెద్దల పాత్ర ఉందా?

అన్న కోణంలో విచారణ కొనసాగాలని చెబుతున్నారు. కమిషన్ ఏర్పాటు అంటే కేసు మళ్లీ మొదలుపెడతారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
విచారణ కమిషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన- సిట్ కేసు రద్దు కాదు, ఛార్జ్‌షీట్ నిలిచిపోదు, కోర్టు ప్రక్రియ ఆగదు అని హైకోర్టు అడ్వకేట్ పి.అప్పారావు చెప్పారు.

కమిషన్ పని వేరే..

త్వరలో ఏర్పాటయ్యే కమిషన్ అసలు ఈ వ్యవహారం ఎలా జరిగింది? పాలనలో ఎక్కడ లోపం? ఎవరు బాధ్యత వహించాలి? అసలు కుట్ర ఎంత లోతుగా ఉంది? అనే అంశాలను కూడా పరిశీలిస్తుంది. ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండి క్యాబినెట్ నిర్దేశించిన అంశాల మేరకు విచారణ జరుపుతుందని, దానికీ సిట్ రిపోర్టుకు సంబంధం ఉండదని అడ్వకేట్ అప్పారావు అన్నారు. కమిషన్ చేసేది నిజనిర్ధారణ మాత్రమే అన్నారు.
సిట్ చెప్పిందే నిజం కాదని, కల్తీ నెయ్యి వెనుక ఇంకా పెద్ద కథ ఉంది అని ప్రభుత్వం భావిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది.

అసలు కేసు ఏమిటంటే..

2024 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తొలిసారి ప్రస్తావించారు. నెయ్యిలో జంతు కొవ్వు (animal fat), పంప్ ఆయిల్స్ వంటి కల్తీలు జరిగాయని, వాటితోనే లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. 2024 అక్టోబర్ 1న ప్రభుత్వం సిట్ (Special Investigation Team) ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ను గుర్తించకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీని CBI ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందంగా ఏర్పాటు అయింది. సిట్ విచారణలో భారీగా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఉటంకించింది. ఈ ఏడాది జనవరిలో సిట్ చార్జ్‌షీట్ ను Nellore ACB కోర్టులో సమర్పించింది. ఇందులో 36 మంది పేర్లు ఉన్నట్లు పేర్కొంది (డైరెక్టర్లు, టీటీడీ అధికారులు, ఇతరులు).
మరోపక్క, YSRCP నేతలు, మాజీ టీటీడీ ఛైర్మన్‌లు చంద్రబాబు ఆరోపణలను వ్యతిరేకించారు. సిట్ నివేదికను ప్రస్తావిస్తూ తమ హయాంలో ఎటువంటి తప్పు జరగలేదని వాదనలు సాగిస్తున్నారు.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే పాలనాపరమైన చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఈ వివాదం తర్వాత- టీటీడీ ఈవో బదిలీ అయ్యారు. కొత్త ఇన్‌చార్జ్ ఈవో నియామకం జరిగింది.
సిట్ ఛార్జ్‌షీట్ తర్వాత కూడా కమిషన్ ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వానికి “అసలు సూత్రధారులను బయటపెట్టే ప్రయత్నం”గా కనిపిస్తున్నప్పటికీ, ప్రతిపక్షం మాత్రం దీన్ని రాజకీయంగా గత ప్రభుత్వాన్ని ఇరికించే వ్యూహంగా అభివర్ణిస్తోంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇది నిజంగా ఆలయ పవిత్రత కోసం జరిగే పూర్తి విచారణ అవుతుందా? లేక రాజకీయ పోరాటంలో మరో ఆయుధమా? అన్నది కమిషన్ పరిధి, నివేదిక, తదుపరి చర్యలపై ఆధారపడి తేలనుంది.
Read More
Next Story