
మచిలీపట్నం పోర్టుకు వెళ్లే రహదారుల ఊహాచిత్రం
హైదరాబాద్ నుంచి సుల్తాన్ నగర్ వచ్చి రోడ్డెక్కితే నేరుగా బందరు పోర్టుకే!
అటు హైదరాబాద్ నుంచి ఇటు కోనసీమ నుంచి బందరు పోర్టుకు పోవడం ఇక ఎంతో సులువు
మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. NH-65, NH-216 జంక్షన్ నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు 6-లేన్ ఎక్స్‌టర్నల్ కనెక్టివిటీ రోడ్ నిర్మాణానికి ₹573.77 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారి NH-216లోని మచిలీపట్నం బైపాస్ మార్గం ద్వారా పోర్ట్‌ను నేరుగా జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తుంది.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు
మొత్తం వ్యయం: ₹573.77 కోట్లు
6-లేన్ ప్రధాన క్యారేజ్‌వే
రెండు వైపులా సర్వీస్ రోడ్లు
3 ఫ్లైఓవర్లు
ఓవర్‌పాస్-కమ్-రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB)
NH-65 నుంచి NH-216 ద్వారా పోర్ట్‌కు ప్రత్యక్ష కనెక్టివిటీ
ఈ రోడ్ సుమారు 8 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. సుల్తాన్‌నగర్ సమీపంలోని NH-65, NH-216 జంక్షన్ వద్ద ప్రారంభమై, మచిలీపట్నం బైపాస్ ద్వారా పోర్ట్‌కు చేరుతుంది.
ఎందుకు ఇది కీలకం?
ఇప్పటివరకు పోర్ట్‌కు వెళ్లే సరుకు వాహనాలు మచిలీపట్నం పట్టణంలోకి ప్రవేశించాల్సి వస్తోంది. కొత్త రహదారి వల్ల హెవీ ట్రాఫిక్ పట్టణం బయట్నుంచే వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో నగర రద్దీ తగ్గుతుంది.
ట్రక్కులు, కంటెయినర్ వాహనాలు సిగ్నల్స్, లోకల్ ట్రాఫిక్‌లో నిలిచిపోవడం తగ్గుతుంది.
ఫలితంగా-
-రవాణా సమయం తగ్గుతుంది
-ఇంధన వినియోగం తగ్గుతుంది
-లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి
-రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ ద్వారా లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఉండదు. భారీ సరుకు వాహనాల నిరంతర ప్రయాణానికి ఇది సహాయపడుతుంది.
పోర్ట్ అభివృద్ధికి ఊతం...
మచిలీపట్నం పోర్ట్‌ను ప్రధాన కార్గో హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఈ రహదారి మౌలిక సదుపాయంగా పనిచేస్తుంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల పరిశ్రమలకు వేగవంతమైన సముద్ర అనుసంధానం లభిస్తుంది.
దీంతో: పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుంది
-లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు ఏర్పడే అవకాశం ఉంటుంది
-తీరప్రాంత ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి
-ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
ఏమిటీ NH-65, NH-216...
NH-65: పుణే నుంచి సొలాపూర్, హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వస్తుంది. పశ్చిమ భారతదేశాన్ని తూర్పు తీరంతో కలిపే కీలక కారిడార్ ఇది.
NH-216: కత్తిపూడి నుంచి కాకినాడ, అమలాపురం, నరసాపురం, భీమవరం, కైకలూరు, మచిలీపట్నం మీదుగా ఒంగోలు చేరుకుని అక్కడ NH-16లో అంటే చెన్నై రూటులో కలుస్తుంది. ఇది తీర ప్రాంత రహదారి.
ఈ రెండు జాతీయ రహదారులను కొత్త 6-లేన్ రోడ్ మచిలీపట్నం పోర్ట్‌తో నేరుగా అనుసంధానిస్తుంది. బంటుమిల్లి, పెడన గ్రామాల మీదుగా ఇది సాగుతుంది.
మొత్తంగా చూస్తే, ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్ట్‌ను దేశీయ రవాణా వ్యవస్థలో సమర్థవంతంగా కలిపే కీలక మౌలిక సదుపాయం.
Next Story

