
పాల వ్యాపారి గణేష్
పాల వ్యాపారి గణేష్ మంచోడే మరి, ఏంపుట్టిందో ఏమో!
కల్తీపాల కల్లోలాన్ని సృష్టించి ఆరుగురి మృతికి కారణమైన పాల వ్యాపారి గణేష్ గురించి గ్రామస్తులు ఏమంటున్నారంటే..
రాజమండ్రి (Rajamahendravaram)లో పాలల్లో కల్తీ ఎలా జరిగిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. కల్తీ పాలు తాగిన పెద్దలు, పిల్లలు మొత్తం 12 మంది వరకు కిడ్నీ సమస్యలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
సీజ్ చేసిన డెయిరీ ఎదుట పోలీసులు
జిల్లా అధికారుల కధనం ప్రకారం, ఈ ఘటనా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాల, కంటైనర్లను విజయవాడ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపారు. సమగ్ర పరీక్షలు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఫ్రిజ్‌లోని ఒక కంటైనర్ కు చిల్లి పడిన కారణంగా కూలెంట్‌లోని monoethylene glycol లీకై పాలల్లో కలిసింది. దీంతో పాలు కలుషితం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాల వ్యాపారి గణేష్ చెప్పిన వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ది ఫెడరల్ ప్రతినిధి కల్తీ పాల అమ్మిన నిందితుడు అడ్డాల గణేష్ గ్రామం నరసాపురానికి స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. కల్తీ పాల విక్రయం కేసులో నిందితుడు అడ్డాల గణేశ్ ను మూడు రోజుల కిందటే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ గణేష్ స్వగ్రామం కోరుకొండ మండలం నరసాపురం. పూర్తి పేరు అడ్డాల గణేశ్వరరావు. వయసు 28 ఏళ్లు. పాల వ్యాపారి. 11 ఏళ్లుగా నరసాపురం గ్రామంలో డెయిరీ నిర్వహిస్తున్నారు. దానిపేరు వరలక్ష్మి డెయిరీ.
పోలీసులు తాళం వేసిన డెయిరీ లోపల వస్తువులు
పుష్కర కాలంగా పాల వ్యాపారం చేస్తున్నా ఎటువంటి ఫిర్యాదులు లేవని స్థానికులు చెబుతున్నారు. పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఇళ్లకు వెళ్లి అమ్ముతుంటాడు. డెయిరీకి తాళం వేసి ఉంది. పాల నిల్వ కోసం పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి. క్యాన్లు, బకెట్లు కనిపిస్తున్నాయి. ఊళ్లో కూడా పాలు అమ్ముతుంటాడని స్థానికులు చెప్పారు.
గణేష్ కుటుంబం సాదాసీదా కుటుంబమే. కొంతకాలం వాళ్ల బావ దగ్గరే పని చేశాడు. అతను ఇచ్చే జీతం చాలకపోవడంతో బతుకుతెరువు కోసం సొంతంగా డెయిరీ ప్రారంభించారు. ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. భార్య, పిల్లలు, తల్లి ఉన్నారు. గణేష్ అరెస్టుతో ఇల్లంతా మూగబోయి ఉంది. తల్లీ సత్యవతి తల్లడిల్లుతోంది. భార్య అడ్డాల పోసిరత్నం కుమిలి కుమిలి ఏడుస్తోంది.
భార్యాపిల్లలతో గణేష్
"నమ్మకమే ప్రాణంగా బతుకుతున్న ఆ పల్లెటూరిపై.. ఇప్పుడు అనేక అపనమ్మకాలు కమ్ముకున్నాయి. ఆ ఊరిలో నమ్మకస్థుడైన పాల వ్యాపారి గణేష్ ఎందుకు ఇలా చేశాడు? ఆ గ్రామంలో ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.
ఫిబ్రవరి 25, బుధవారం.. నర్సాపురం వాసులకు అదొక పీడకల. ఈ ఊరికి చెందిన గణేష్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సుమారు 170 కుటుంబాలకు పాలు పోస్తుంటుంటాడు. ఏళ్ల తరబడి అతను పోసే పాలను నమ్మి తాగిన జనం.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడా గ్రామం బిక్కుబిక్కుమంటోంది. వచ్చిపోయేవాళ్ల తాకిడి ఎక్కువగా ఉంది. పోలీసుల హడావిడి సరేసరి.
"గణేష్ అంటే ఆ ఊరికి కేవలం పాల వ్యాపారి మాత్రమే కాదు.. మంచివాడనే పేరూ ఉంది. అలాంటి వ్యక్తి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడంటే గ్రామస్థులు నమ్మలేకపోతున్నారు. గణేష్ వాళ్ల అమ్మ మాటల్లో చెప్పాలంటే అతను చాలా కష్టజీవి. చాలా కష్టపడి పైకి వచ్చిన వాడు. ఇప్పుడెందుకు ఇలా జరిగిందోనని కుమిలిపోతోంది. నా కొడుకు ఎవరికీ కీడు చేసేవాడు కాదు సామీ.. వాడు కష్టపడి పైకి వచ్చాడు' అంటూ గణేష్ తల్లి అడ్డాల సత్యవతి ఏడుస్తోంది.
ఆయన తల్లే కాదు.. ఊరిలోని పెద్దలు కూడా గణేష్ గురించి చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఏదైనా ఇరుకు ఇబ్బంది వస్తే చేదోడు వాదోడుగా ఉండే వాడు ఇప్పుడు ఇంత మంది చావుకు కారణమయ్యాడా? అని వరలక్ష్మీ అనే ఆమె విస్మయం వ్యక్తం చేశారు..నర్సాపురం వాసులకు గణేష్ చాలా కాలంగా తెలుసు. వాళ్లందరికీ పాలు పోయడమే కాకుండా ఏదైనా ఫంక్షన్లు, ఊరి ఉత్సవాలు జరిగినపుడు అతడే 20,25 లీటర్ల వరకు పాలు కూడా ఉచితంగా పోస్తుంటారని స్థానికుడు బుచ్చిరాజు చెబుతున్నారు.. అసలు పాలలో ఏం కలిపాడు? స్వలాభం కోసమా లేక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో చర్చ జరుగుతోంది.
ఎప్పుడూ ఏ తప్పు చేయనివాడు ఎందుకు ఈ పని చేశాడో ఆ భగవంతుడికే తెలియాలని మారిశెట్టి సత్తిరాజు అన్నారు.
ఏది ఏమైనా, అసలు విషయం ల్యాబ్ రిపోర్టులు వస్తే గాని తెలియదు. "నర్సాపురం ఘటన ఒక హెచ్చరిక. మనం తాగే పాలే మన ప్రాణాలకు యమపాశాలుగా మారుతుంటే.. ఇక సామాన్యుడు ఎవరిని నమ్మాలి? ప్రభుత్వం ఈ కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏ గ్రామంలోనూ ఇలాంటి పసిబిడ్డల, నిరుపేదల ప్రాణాలు గాల్లో కలిసి పోకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
Next Story

