
ఇటీవల చైనా సందర్శించిన డాక్టర్ జతిన్ కుమార్ అనుభవం
చైనా రాజధాని బీజింగ్ లో నేను చూసిన బుక్ స్టోర్
2025 జూన్ 9 వ తారీకు నుండి 15 తేదీ వరకు భారత చైనా సంయుక్త వైద్య బృందంలో భాగంగా11 మంది భారతీయ వైద్యులు చైనా ను సందర్శించారు. అందులో నేను కూడా వున్నాను. 13 వ తారీఖున బీజింగ్ నగరంలో కాస్త తీరిక చిక్కితే నగర సందర్శన చేస్తూ ఒక మంచి అనుభూతిని సంపాదించు కొన్నాను. ఆ వివరాలు మీతో పంచుకుంటున్నాను.
చైనా రాజధాని బీజింగ్ నగరంలో మేము బస చేసిన న్యూవరల్డ్ హోటల్ కు 2- కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ బీజింగ్ లోని వాంగ్ ఫ్యూజింగ్ డాజీ (డాంగ్ చెంగ్ జిల్లా) అనే ప్రాంతం ఆరంభంలోనే ఉన్న వాంగ్ ఫ్యూజింగ్ అవెన్యూలోని “విదేశీ భాషా పుస్తక దుకాణం”కి వెళ్లాను.

ఇది బీజింగ్ లోని అతిపెద్దదైన, సమగ్రమైన పుస్తక దుకాణాలలో ఒకటి. ఒక పెద్ద బహుళ అంతస్తుల భవనం పూర్తిగా ఈ పుస్తక దుకాణం విస్తరించివుంది. అనేక రంగాలకు చెందిన వివిధ రకాల పుస్తకాలను పెద్ద ఎత్తున సేకరించి వుంచారు.వాటిని సులభంగా ఎంపిక చేసుకోవడానికి వీలుగా వివిధ విభాగాలుగా విభజించారు. వారు ప్రపంచ సాహిత్యాన్ని చైనీస్ భాషలోకి అనువదించి, ప్రచురించి అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంచారు. వివిధ వయసుల వారికి అక్కడ రీడింగ్ ఏరియాలు ఉన్నాయి. సీట్లన్నీ నిండిపోవడంతో ఎందరో నేలపైనో, మెట్ల మూలల్లోనో కూర్చొని తమకు నచ్చిన పుస్తకాలు చదువుతున్నారు. ఇది బుక్ షాపా లేక గ్రంథాలయమా అని అనుమానం కలుగుతుంది.
గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లలకు ఆకర్షణీయమైన పుస్తకాలు, వివిధ జ్ఞాపికలను అమ్మకానికి ఉంచారు. అవి వివిధ రకాల కలర్ పెన్సిళ్లు, క్రేయాన్లు మరియు ఎరేజర్ల నుండి చిన్నచిత్రాలు,కళాఖండాల వరకు ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, స్వీయ బోధనకు ఉపయోగించే స్వయం చాలక పరికరాలుకూడ లభ్యమవుతాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో చైనా కమ్యునిస్ట్ పార్టీ [సిపిసి] రచనలు, జిన్ పింగ్ ఆలోచనా స్రవంతిని ప్రతిబింబించే పుస్తకాలు వున్నాయి. కమ్యూనిస్టు క్లాసికల్స్, బోధనలు సబ్జెక్టుల వారీగా వేర్వేరుగా వుంచారు. ఒబామా, హిల్లరీ, మాక్రాన్, థాచర్, ఏంజెలా, గాంధీ వంటి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నాయకుల జీవిత చరిత్రలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ పరిణామాల గురించి ఆ ప్రజలకు ఏమీ తెలియనివ్వరు అనేది ఒక అభూత కల్పన మాత్రమే అని స్పష్టంగా తెలిసిపోతుంది.
రెండవ అంతస్తులో ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యలో విదేశీ భాషలలో పాఠ్యపుస్తకాలు [ఆంగ్లం మరియు ఇతర భాషలు వున్నాయి. వివిధ వయసుల పాఠశాల పిల్లలతో ఫ్లోర్ నిండిపోయి,చాలా హడావుడిగా వున్నది.
అక్కడి నుంచి జనసందోహం మధ్య కాస్త కష్టపడి తప్పుకుని మూడవ అంతస్తుకు చేరుకున్నాం. అక్కడ ఒరిజినల్ ఇంగ్లిష్ ఎడిషన్లు, వాటి చైనీస్ అనువాదాలు చాలా వున్నాయి. అదేవిధంగా ఆంగ్లంలోకి అనువదించిన చైనీస్ పుస్తకాలను కూడా అక్కడ ప్రదర్శిస్తారు. మూడవ అంతస్తులో చైనీస్ క్లాసిక్స్, పిక్టోరియల్స్, దిగుమతి చేసుకున్న ఒరిజినల్స్, సంగీతానికి సంబంధించిన పుస్తకాలు మరియు సంగీత వాయిద్యాలు అమ్మకానికి ఉన్నాయి. నాల్గవ అంతస్తులో సౌందర్యానికి సంబంధించిన పుస్తకాలు, కళలు, పెయింటింగ్స్, ఆల్బమ్స్ అందుబాటులో ఉన్నాయి. 5వ అంతస్తులో బయాలజీ, మెడికల్ సైన్సెస్, లివింగ్ హెల్త్, కుంగ్ఫూ, కరాటే వంటి మార్మిక కళల కు సంబంధించిన పుస్తకాలన్నీ చైనీస్ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ అంతస్థులో పుస్తకావిష్కరణలు, పాఠకులు సమీక్షా సమావేశాలు జరుపుకోవటానికి వీలుగా చిన్న సమావేశ స్థలం విడిగా వున్నది.

సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్ కు సంబంధించిన పుస్తకాలు కూడా టాప్ సెల్లింగ్ లేయర్ ను ఆక్రమించాయి. షేక్ స్పియర్, హోరీ పోటర్ నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకు ఎందరో సుపరిచితులు ఈ పుస్తక శాలలో మనకు కనిపిస్తారు. రాకెట్ మిస్టరీ నుంచి రోబోల వరకు వివిధ విషయాల పై పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. నెలకు లక్ష మందికి పైగా ఈ దుకాణానికి వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్తారని తెలిసింది. 'దుర్భరమైన కాలం ఇక ముగిసింది. నాణ్యమైన రీడింగ్ కంటెంట్ నిరంతరాయంగా సరఫరా అవుతుందని మేము విశ్వసిస్తున్నాము.” అని కోవిడ్ మహమ్మారిని ప్రస్తావిస్తూ ఈ షాపు దర్శకుడు అన్నారు.

కావలసిన పుస్తకాలు డిస్కౌంట్ రేటులో కొనుగోలు చేసుకుని, ఒక పుస్తకాల షాపులో ఎన్ని వసతులు, ఎంత అందమైన అమరిక, ఎన్ని అభిరుచు లకు తావు కల్పించారు, పిల్లలలో అధ్యయన అలవాటును ఎంత సులువుగా మేలుకొలుపుతున్నారు అనుకుంటూ ఆశ్చర్యంతో బయటకు వచ్చాము. అనంతరం నాలుగు అడుగులు వేస్తే వాంగ్ఫుజింగ్ స్ట్రీట్ మార్కెట్ కనపడుతోంది. అక్కడ కుప్పలు కుప్పలుగా పిల్లలు కేరింతలు కొడుతూ కనిపించారు. ఎందుకా? అని చూస్తే అక్కడ “ రష్యా ఫెస్టివల్ “ జరుగుతోంది. అక్కడ రష్యా ఐస్ క్రీంల నుండి ఏరో ఫ్లోట్ సేవల వరకు, రష్యా జానపద గాధలనుండి సాంస్కృతిక ప్రదర్శనల వరకు, రష్యన్ జీవితంలోని వివిధ కోణాల ప్రదర్శనతో అనేక అంశాలు ఆకట్టుకునే విధంగా వున్నాయి. చైనా పెద్దలు, పిల్లలు వాటిలో చాలా ఆసక్తిగా పాల్గొనటం, రంగులు పూసుకుని, రకరకాల రష్యా సంప్రదాయ దుస్తులు వేసుకుని ఫోటోలు తీయించుకోవటం కన్నుల విందుగా సాగుతోంది. రష్యా ఇత్తడి బ్యాండ్ నుంచి పిల్లల హస్తకళల వరకు మినీ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆ సాంస్కృతిక వాహినిలో చైనా పిల్లలతో పాటు మేము పిల్లలమై తిరిగి, ఆసాయంత్రం ఆహ్లాదకరమైన అనుభూతులు మూట గట్టుకుని వచ్చాము.