
‘కొడవ’ పద్ధతిలో రష్మిక - విజయ్ పెళ్లి, ఆ విధానం ఏంటంటే
రష్మిక కట్టుకోబోయే ఆ చీర వెనుక రహస్యం
ఉదయ్‌పూర్ కోటలో ఉదయం 10:10 గంటలకు తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేయడం ఇప్పటికే దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే అసలైన మజా ఈ సాయంత్రం ఉండబోతోంది. అవును.. 'విరోష్' జంట ఇప్పుడు రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రష్మిక సొంత ఊరైన కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం జరగబోయే ఈ వేడుక వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పెళ్లిలో అగ్ని సాక్షిగా ఏడు అడుగులు ఉండవు.. అసలు పురోహితుడు మంత్రోచ్ఛరణలే వినిపించవు!
పూజారి లేని పెళ్లి.. ప్రకృతి సాక్షిగా బంధం!
సాధారణంగా హిందూ వివాహాల్లో పురోహితులు, మంత్రాలు, అగ్ని గుండం ప్రధానంగా ఉంటాయి. కానీ కొడవ సంప్రదాయం చాలా భిన్నమైనది. ఇందులో బ్రాహ్మణ పురోహితులు ఉండరు. అంతా ప్రకృతిని, పూర్వీకులను స్మరిస్తూ సాగుతుంది. 'కావేరమ్మ' (కావేరి నది)ని దైవంగా భావించి, కేవలం కుటుంబ పెద్దల ఆశీస్సులతోనే ఈ బంధం ముడిపడుతుంది. ఉదయం తెలుగు పద్ధతిలో విజయ్ సంప్రదాయానికి గౌరవం ఇస్తే, సాయంత్రం వేళ రష్మిక తన మూలాలను ప్రపంచానికి చాటి చెప్పబోతోంది.
కుడి భుజంపై కొంగు.. పాతక్ మెరుపులు!
ఈ వేడుకలో రష్మిక కట్టుకోబోయే చీర స్టైల్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. దీనిని 'కొడవ ఉడుగే' అంటారు. మనం సాధారణంగా కొంగును ఎడమ భుజంపై వేసుకుంటే, వీరు మాత్రం కుడి భుజంపై వేసుకుంటారు. కుచ్చెళ్లు వెనుక వైపు వస్తాయి. దీనికి తోడు రష్మిక 'పాతక్' అనే సంప్రదాయ బంగారు నాణెం ఉన్న నెక్లెస్‌ను ధరించనుంది. ఇక మన రౌడీ స్టార్ విజయ్ కూడా కొడవ పురుషులు ధరించే 'కుప్య' (నలుపు రంగు కోటు) లో పక్కా యోధుడులా కనిపించబోతున్నాడు.
డ్యాన్సుల హోరు.. వాల్గ రచ్చ!
ఈ పెళ్లి కేవలం పూజలతోనే ముగియదు. కొడవ సంప్రదాయంలో 'వాల్గ' అనే జానపద నృత్యానికి పెద్దపీట వేస్తారు. బంధుమిత్రులందరూ కలిసి చేసే ఈ డ్యాన్స్ పెళ్లి మండపాన్ని దద్దరిల్లేలా చేస్తుంది. ఇప్పటికే తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా వంటి వాళ్ళు ఈ వేడుకలో అడుగులు వేయడానికి రెడీ అయిపోయారు. 8 ఏళ్ల స్నేహం, ప్రేమ.. ఇప్పుడు ఇలా రెండు విభిన్న సంస్కృతుల కలయికతో ఒక అద్భుత ఘట్టంగా మారుతోంది.
సమాజం గీసిన గీతలను దాటి, తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా బతకడం విజయ్‌కి ఇష్టం.. అలాగే తన సంప్రదాయాన్ని గర్వంగా చాటడం రష్మికకు ఇష్టం. అందుకే ఈ అన్‌ప్లగ్‌డ్ వెడ్డింగ్‌లో ఈ ఇద్దరి తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. సాయంత్రం జరగబోయే ఈ అరుదైన వేడుక తర్వాత, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో టాలీవుడ్ మొత్తానికి గ్రాండ్ ట్రీట్ ఉండబోతోంది.

