
శాంతీ, 6 ఏళ్లలో ఇంత డబ్బు ఎలా వెనకేశావమ్మా!
దేవుడి శాఖాధికారి 'శాంతి'కీ అరెస్ట్ తప్పకపాయే!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (AC) కె. శాంతికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆమెను విజయవాడ జైలుకు తరలించారు.
ఆరేళ్ల సర్వీసు.. కోట్లలో ఆస్తులు
శాంతి 2020లో దేవాదాయ శాఖలో విధుల్లో చేరారు. ఆమె సర్వీసులో చేరి పట్టుమని ఆరేళ్లు కూడా పూర్తికాకముందే కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె తీరు వివాదాస్పదంగా మారింది. గతంలో 20 నెలల పాటు సస్పెన్షన్‌లో ఉన్న శాంతి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవలే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
గతంలో ఆమె కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు కూడా ఆమె వివాదాల్లోకి వచ్చింది. దానిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. కేవలం ఆమె ఒక ఉద్యోగిగా మాత్రమే తన ఇంటికి వచ్చిందని, ఆమె సాయం కోరి వచ్చారని విజయసాయి రెడ్డి ఆనాడు వివరణ కూడా ఇచ్చారు. ఆమె తన తొలిభర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారని కూడా సమాచారం. ఓ మామూలు అధికారిగా ఉంటూ హెలికాఫ్టర్లలో, ప్రత్యేక విమానాల్లో తిరిగే వారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ఏకకాలంలో సోదాలు.. విల్లాలు, ఫ్లాట్లు గుర్తింపు
విజయవాడ ఏసీబీ రేంజ్ డీఎస్పీ స్రవంతి రాయ్ నేతృత్వంలో మంగళవారం తాడేపల్లి, ఉండవల్లి పరిసరాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు కనుగొన్న ఆస్తుల చిట్టా ఇలా..
విశాఖపట్నం శివారు ఎండాడలో ఒక ఖరీదైన ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో ఒక విల్లా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇంట్లో 700 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆమె ఒంటిపై 76 గ్రాముల బంగారం, సుమారు 3 కిలోల వెండి వస్తువులు, రూ. 1.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఒక ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు, వెస్పా మోటార్ సైకిల్‌తో పాటు ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకు లాకర్లు, రుణాల మాయాజాలం
శాంతి తన పేరున ఉన్న విల్లా, ఫ్లాట్లను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు తనిఖీల్లో తేలింది. విజయవాడ వన్ టౌన్ పరిధిలోని యూనియన్ బ్యాంకులో ఆమెకు ఒక లాకర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోర్టు అనుమతితో ఈ లాకర్‌ను తెరిచి సోదాలు చేయనున్నారు. విచారణలో భాగంగా తాను హైదరాబాద్‌లో రెండో వివాహం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులకు ఆమె వెల్లడించారు. తాడేపల్లిలో ఆమె ఉంటున్న మండువా ఇల్లు అత్తగారి పేరున ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ఆ ఇంటి కొనుగోలు వివరాలపై ఆరా తీస్తున్నారు.
కేవలం ఆరేళ్ల కాలంలోనే ఇంత భారీ స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Next Story

