
పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలపడం
రాజమండ్రి అల్లకల్లోలం, 'అనూరియా' వ్యాధి కలకలం
పాల వ్యాపారి అరెస్ట్, అసలేమిటీ అనూరియా వ్యాధి..
పాలు కూడా మనిషి ప్రాణాలు తీస్తున్నాయి. రాజమండ్రి అల్లకల్లోలంగా ఉంది. కల్తీపాలు తాగు ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 4కి చేరింది. మరో 13 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై కొద్దిసేపటి కిందట ప్రకటన చేశారు. నలుగురు మృతులకు రూ.10లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. కల్తీ పాలు తాగడం వల్ల నలుగురు మృతి చెందారని తెలిపారు. దోషుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మరోపక్క పాలవ్యాపారి గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లోని 50వ డివిజన్ లాలాచెరువు చౌడేశ్వరనగర్‌లో ఈనెల 16 నుంచి పలువురు మూత్రం (యూరిన్) ఆగిపోతోందంటూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కిడ్నీ సమస్య వంటి కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఇప్పటి వరకూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్కసారిగా ఐదుగురి పరిస్థితి సీరియస్ అయింది. ఇద్దరు చనిపోయినట్టు తెలిసింది. దీంతో ఈ వార్త బయటికి వచ్చింది.
కల్తీ పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు బాధితులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట కనకలక్ష్మి(85) మృతిచెందినా అది నమోదు కాలేదు. ఆదివారం తాడి కృష్ణవేణి(65) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతిచెందారు. రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరుగురు ఐసీయూలో ఉండగా నలుగురి పరిస్థితి సీరియ్‌సగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి చౌడేశ్వర నగర్ ప్రాంతంలో సర్వే చేశారు.
కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేశ్ అనే పాల వ్యాపారి చాలా కాలంగా వీరందరికీ పాలు అమ్ముతున్నాడు. ఈ నెల 16న విక్రయించిన పాలు చేదుగా ఉండడం.. ఆ పాలు తాగిన వారికి అస్వస్థతగా ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గణేశ్‌ను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలువురు రైతులనూ పోలీసు స్టేషన్‌కు పిలిచారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్టు చెప్పారు. మునిసిపల్ అధికారులు మంచినీటి పరీక్షలు నిర్వహించారు. కానీ పాలలో కూడా యూరి యా, ఇతర పిండి పదార్థాలు కలుపుతున్నార నే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. అందువల్ల జనమే తమని తాము కాపాడుకునే పరిస్థితి తలెత్తింది. రాజ చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికులు- కల్తీ పాలపై ప్రచారం చేపట్టారు.
కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
అసలేమిటీ అనూరియా వ్యాధి...
కల్తీ పాలు (Adulterated milk) తాగడం వల్ల అనూరియా (Anuria) వచ్చే అవకాశం ఉందని గుంటూరు జీజీహెచ్ డాక్టర్ జి. విజయసారధి చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి..
అనూరియా అనేది నేరుగా వచ్చే వ్యాధి కాదు. అనూరియా అనేది ఒక వ్యాధి లక్షణం. శరీరంలో మూత్రపిండాలు పనితీరు మందగించి మూత్రం ఉత్పత్తి కాక పొట్ట ఉబ్బి మనుషులు కన్నుమూస్తుంటారు.
వైద్య పరిభాషలో ఒక వ్యక్తి రోజుకు 100 మిలీలీటర్ల కంటే తక్కువ మూత్రాన్ని విసర్జిస్తే దానిని 'అనూరియా' అంటారు. ఇది మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని (Acute Kidney Injury) చెప్పడానికి ప్రధాన సంకేతం.
కల్తీ పాలకు, అనూరియాకు సంబంధం ఏమిటి?
పాలను చిక్కగా చూపించడానికి లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతుంటారు. ఇవి అనూరియాకు దారితీసే అవకాశం ఉంది.
మెలమైన్ (Melamine)
పాలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉన్నట్లు చూపించడానికి దీనిని కలుపుతారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరిచి, కిడ్నీలు పూర్తిగా ఆగిపోయేలా చేస్తుంది. ఫలితంగా అనూరియా సంభవిస్తుంది.
యూరియా (Urea)
పాలను తెల్లగా మార్చడానికి యూరియా వాడుతుంటారు. శరీరంలో యూరియా మోతాదు ఎక్కువైతే కిడ్నీలపై విపరీతమైన భారం పడి అవి విఫలమవుతాయి.
డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా
ఇవి జీర్ణక్రియను పాడు చేయడమే కాకుండా శరీరంలోని ఇతర అంతర్గత అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి.
అనూరియా లక్షణాలు ఎలా ఉంటాయి?
ఒకవేళ కల్తీ పాల ప్రభావం వల్ల కిడ్నీలు దెబ్బతింటే ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:
మూత్రం రాకపోవడం లేదా చాలా తక్కువగా రావడం.
కాళ్లు, చేతులు, కళ్ల కింద వాపులు రావడం (Edema).
వికారం, వాంతులు, తీవ్రమైన అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.
మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పాలలో నీళ్లు కలిశాయో లేదో లాక్టోమీటర్‌తో చూడొచ్చు. కానీ రసాయనాలు కలిశాయో లేదో తెలుసుకోవడానికి 'మిల్క్ అడల్ట్రేషన్ టెస్ట్ కిట్స్' వాడటం మంచిది. ప్యాకెట్ పాలు కొనేటప్పుడు పేరున్న బ్రాండ్స్ లేదా ప్రభుత్వ డెయిరీల నుండి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎవరికైనా మూత్ర విసర్జనలో సమస్య ఉంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ (కిడ్నీ డాక్టర్)ను సంప్రదించాలి. కల్తీ పాల వల్ల కేవలం అనూరియా మాత్రమే కాదు, దీర్ఘకాలంలో క్యాన్సర్, పేగు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
Next Story

