ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్ టెక్నాలజీ రంగంలో ఛాంపియన్ గా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో కుదుర్చుకున్న ఈ ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరాయి. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన దిశగా ఈ ఒప్పందాలు ఉపయోగపడనున్నాయి. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, ఏపీలో ఏఐ-క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేసేలా ఈ ఏడు ఎంఓయులను ప్రభుత్వం కుదుర్చుకుంది. అలాగే భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.
సీఎం చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న 7 ఒప్పందాల వివరాలు
MOU-1
క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంఓయులో పేర్కొన్నారు. ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించేలా ఈ ఎంఒయూ ఉపకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కార్యక్రమానికి యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ సహా ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
MOU-2
క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఎంఓయూ చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేలా ఐబీఎం అంగీకరించింది. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణా కార్యక్రమాన్ని రూపందించింది. ఒప్పందం కార్యక్రమానికి ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఆ సంస్థ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, ఐబీఎం రీసెర్చ్ లాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ తదితరులు హాజరయ్యారు.
MOU-3
ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక రూపొందించింది. మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు కల్పించనుంది. అలాగే భూమి, క్వాంటం హార్డ్‌వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ లో నేషనల్ హబ్ గా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో NIELIT డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, కంట్రోలర్ జనరల్ డాక్టర్ అలోక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
MOU-4
రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో భారత్ జెన్ సీఈఓ హృషీకేశ్ మోహల్ బాల్, ప్రతినిధి రామకృష్ణన్ లు నెక్స్ జెన్ సీఈఓ రాజగోపాల్, ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ పాల్గోన్నారు.
MOU-5
ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేలా ఎంఓయూ చేసుకున్నారు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఫోకస్ పెట్టేలా కాలిబో సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ కార్యక్రమంలో రాజ్ వట్టికూటి, అరబిందో సాహూ, విపుల్ వలంజీ, పింటో జోయ్సన్, జోహన్నెస్ ష్రోడర్ తదితరులు పాల్గొన్నారు.
MOU-6
అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేలా వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేసేలా ఈ ఒప్పందం ఉంది. ఈ ఎంఓయూలో క్వాంటం సొల్యూషన్స్ హెడ్ వర్ధన్ సెహగల్, రాజ్ వట్టికూటి బృందం పాల్గొంది.
MOU-7
ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామ కోటి, ప్రొఫెసర్ మితేష్ పాల్గొన్నారు.