అమరావతికి చట్టబద్ధత ఓవర్.. ఇక ప్రపంచ బ్యాంకు వంతు
x

అమరావతికి చట్టబద్ధత ఓవర్.. ఇక ప్రపంచ బ్యాంకు వంతు

ముఖ్యమంత్రితో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ.


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగి, పరిపాలనాపరమైన చట్టబద్ధత ప్రక్రియ పూర్తి కావడంతో.. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ భేటీలో అమరావతి నిర్మాణ ప్రగతిని పరిశీలించిన ప్రతినిధులు, నగరాభివృద్ధికి తమ వంతు మద్దతుపై సానుకూల సంకేతాలిచ్చారు.

రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా అమరావతి
అమరావతి కేవలం ఒక రాజకీయ రాజధాని మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులను మార్చే ఒక గ్రోత్ ఇంజిన్ అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఐటీ , విద్యుత్ రంగాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, ఇక్కడ కల్పిస్తున్న అత్యాధునిక మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ నగరం వాణిజ్య కార్యకలాపాలకు దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం
ప్రపంచ బ్యాంకు బృందానికి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని మూడు ప్రధాన రీజియన్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి ఉన్న భౌగోళిక, ఆర్థిక వనరుల ఆధారంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
పెట్టుబడులకు సానుకూల సంకేతాలు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలు, అభివృద్ధి వేగం పట్ల ప్రపంచ బ్యాంకు బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సహకారం, సాంకేతిక తోడ్పాటు అందించే విషయంలో తాము సానుకూలంగా ఉన్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. ఈ భేటీతో అమరావతికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read More
Next Story