కూటమి చేతగానితనం వల్లే ఏపీకి తీరని నష్టం : వైఎస్సార్‌సీపీ ఎంపీలు
x

కూటమి చేతగానితనం వల్లే ఏపీకి తీరని నష్టం : వైఎస్సార్‌సీపీ ఎంపీలు

కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా ఏపీ ప్రయోజనాలను బలిపెడుతున్నారని వారు మండిపడ్డారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత విధిస్తూనే, ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసేలా కేంద్రం కుట్ర చేస్తోందని పార్టీ ఎంపీలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని, ఫలితంగా ఏపీ ప్రయోజనాలను బలిపెడుతున్నారని వారు మండిపడ్డారు.

రూల్ ఆఫ్ లా లేదు..రైలు కారిడార్ లేదు : వైవీ సుబ్బారెడ్డి

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని ఆరోపిస్తూ మూడు కీలక అంశాలను ప్రస్తావించారు.

రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపిందని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయడం అన్యాయమని, దీనివల్ల రాష్ట్రం తన నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయి భవిష్యత్తు ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నిర్ణయించిన పూర్తి స్థాయి మట్టం (FRL) వరకు నిధులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించినా, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక కారిడార్ కేటాయింపులు జరగలేదని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను కలుపుతూ కారిడార్లు ఇచ్చారు కానీ, ఏపీకి సొంతంగా ఒక హైస్పీడ్ రైలు కారిడార్ సాధించలేకపోయారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై కనీస ఒత్తిడి కూడా తేలేకపోయింది అని విమర్శించారు.

రాజకీయ దాడులతో వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెడుతున్నా, జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని కేంద్రమే గుర్తించిందని ఆయన గుర్తుచేశారు. జగన్ హయాంలో చేపట్టిన డిజిటల్ ల్యాండ్ సర్వే (భూ రీసర్వే) ఒక విప్లవాత్మకమైన మార్పు అని, దీనిని కేంద్ర ఆర్థిక సర్వే (Economic Survey 2025-26) కూడా కొనియాడిందని తెలిపారు. గత ప్రభుత్వ అద్భుత పనితీరుకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని, దీనిపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఒకవైపు రాజకీయ దాడులు చేస్తూ మరోవైపు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఎండగట్టారు.

ఉపాధి హామీపై కుట్ర..పేదల బతుకులతో ఆటలా? : పిల్లి సుభాష్

రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కేంద్ర బడ్జెట్‌పై ఆవేదన వ్యక్తం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన రెండు ప్రధాన అంశాలను లేవనెత్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) క్రమంగా నీరుగార్చి, ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు జీవనాధారంగా ఉన్న ఈ పథకానికి నిధులు తగ్గించడం అంటే, పేదల బతుకులను భారంచేయడమేనని మండిపడ్డారు. పేదల చేతికి డబ్బు అందితేనే మార్కెట్‌లో నగదు చలామణి జరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అటువంటిది పేదల పొట్ట కొట్టేలా నిధులు తగ్గించడం దారుణం అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తన బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటూ, సంక్షేమ పథకాల ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపైకి నెడుతోందని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రామీణాభివృద్ధి నిధులు రాకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా బడ్జెట్ ఉంది తప్ప, సామాన్య ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని ఆయన ధ్వజమెత్తారు.

అవినాష్ రెడ్డి, గొల్ల బాబూరావు

వైఎస్సార్‌సీపీ ఎంపీలు వై.ఎస్. అవినాష్ రెడ్డి, గొల్ల బాబూరావు కేంద్ర బడ్జెట్ వైఫల్యాలను, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దాడులను ముడిపెడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ధ్వజమెత్తారు. ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 57 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు తగ్గించడం రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ. 27 వేల కోట్ల గ్రాంట్‌ను కోల్పోయిందన్నారు. ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేకపోవడం ఉత్తరాంధ్ర ప్రజలను వంచించడమేనని, రాష్ట్రానికి రావాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న అప్పులు రాబోయే తరాల పై తీరని భారంగా మారుతాయని హెచ్చరించారు.

Read More
Next Story