
2016కు ముందు ఇంటి పట్టా ఉంటే… రిజిస్ట్రేషన్
భూమి యజమానులకు కొత్త ఊపిరి, చంద్రబాబు ప్రభుత్వం భారీ సంస్కరణలు.
ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో ఇంటి పట్టా పొందిన 75 లక్షల పేద కుటుంబాలకు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి పట్టా ఉన్నవారు ఇప్పుడు ఇంటిని నేరుగా విక్రయించవచ్చు, గిఫ్ట్ డీడ్‌గా ఇవ్వవచ్చు లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది పేదల ఆస్తులను నిజమైన ఆస్తిగా మార్చే చర్యగా పరిగణించవచ్చు. 2016కు ముందు ఇంటి పట్టా పొందిన వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది.
అంతేకాకుండా రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ కింద ఉన్న 13.59 లక్షల ఎకరాల్లో అర్హత ఉన్న 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు.
డిజిటల్, బ్లాక్‌చైన్ రక్షణ, భూములకు కవచం
భూమి రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి, భూ యజమాని మొబైల్‌కు సాఫ్ట్ కాపీ పంపించాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఆ రికార్డులను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రపరచాలని సూచించారు. భూ యజమానులు ఆధార్, ఈ-కేవైసీ ఇచ్చి రికార్డు లాక్ చేసుకోవచ్చు. దీంతో వారి అనుమతి లేకుండా ఎవరూ రిజిస్ట్రేషన్ చేయలేరు. ఇది భూములకు డిజిటల్ కవచంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి రీ-సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం రీ-సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలు సృష్టించిందని చెబుతూ వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టిందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, వీటిలో 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాసు పుస్తకాలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. మిగిలిన 1,259 గ్రామాల్లోని 9 లక్షల పాసు పుస్తకాలను ఈ ఏడాది జూలై నాటికి అందజేయాలని ఆదేశించారు.
1.37 లక్షల ఎకరాలకు విముక్తి
1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు. అలాగే ఇతర సర్వీస్ ఇనాం భూముల్లో మరో లక్ష ఎకరాలకు కూడా విముక్తి కల్పించనున్నారు. దీనికోసం కొత్త చట్టం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

