
రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ చేతికి టీటీడీ ’లడ్డూ’ కేసు
టీటీడీ నెయ్యి కుంభకోణంపై ఏక సభ్య కమిటీ నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డు మీద మరొక కమిషన్ ఏర్పాటయింది.ఇది ఏక సభ్య కమిషన్. మాజీ ఐఎఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ కమిషన్ చీఫ్ గా వ్యవహరిస్తారు. 45రోజులలో ఈ కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
కొన్ని కంపెనీలు టిటిడి లడ్డు తయారు చేసేందుకు వాడే నెయ్యిలో కల్తీ చేయడం, నాసిరకం నెయ్యి సరఫరా చేయడం మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఇప్పటికే ఒక విచారణ జరిపింది. దీని మీద కోర్టు చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. సిబిఐ-సిట్ నివేదిక పరిశీలించి ప్రభుత్వం పరంగా కల్తీనెయ్యి కొనుగోలులో ప్రభుత్వం, పాలనపరంగా జరిగిన లోపాలను పరిశీలించే ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు దినేష్ కుమార్ కమిషన్ పనిచేస్తుంది.ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో ఆర్టీ నెం.458ను జారీ చేసింది.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం.470/2024గా నమోదైన ఈ కేసుకు సంబంధించి సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పర్యవేక్షణలో ఎస్ఐటీ దర్యాప్తు చేపట్టింది. ఎస్ఐటీ జనవరి 23, 2026న కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించిన అనంతరం, స్వంతంగా తయారు చేసిన నోట్లో నెయ్యి టెండర్ నిబంధనల రిలాక్సేషన్, అమలులో లోపాలు, అలసత్వాలు, వైఫల్యాలకు పాల్పడిన టీటీడీ కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
దినేష్ కుమార్
ఈ నోట్‌ను పరిశీలించడానికి ప్రభుత్వం ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి దినేష్ కుమార్ (1983 బ్యాచ్) ఏక సభ్య కమిటీగా నియమించింది. కమిటీ పనివిధానాలు ఇలా ఉన్నాయి. దినేష్ కుమార్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ గాపనిచేశారు.
పని పరిధి: టెండర్ నిబంధనల రిలాక్సేషన్, అమలులో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ లోపాలు, అలసత్వాలు లేదా వైఫల్యాలను అంచనా వేయడం. సరైన జాగ్రత్త, రికార్డెడ్ జస్టిఫికేషన్, విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారా అని పరిశీలించడం. అధికారులు, కమిటీ సభ్యులు లేదా టీటీడీ ఫంక్షనరీల బాధ్యతను గుర్తించడం. తగిన అడ్మినిస్ట్రేటివ్ లేదా డిసిప్లినరీ చర్యలకు సిఫారసు చేయడం. పరిశీలనను అడ్మినిస్ట్రేటివ్, గవర్నెన్స్ అంశాలకు మాత్రమే పరిమితం చేయడం.
అధికారాలు: దర్యాప్తు అధికారి కమిటీ రికార్డులు పరిశిలించి రాతపూర్వక వివరణలు కోరవచ్చు. ప్రభుత్వ ముందస్తు అనుమతితో నిపుణుల సహాయం తీసుకోవచ్చు.
కాలపరిమితి: ఈ ఆర్డర్ జారీ అయిన తేదీ నుంచి 45 రోజుల్లో నివేదిక సమర్పించాలి.
సహాయం: టీటీడీ అవసరమైన సహాయం అందించాలి.
నివేదిక స్వభావం: ఈ నివేదిక సిఫారసు రూపంలో ఉంటుంది. ప్రభుత్వం దానిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుంది.
సేఫ్‌గార్డ్: ఈ ఆర్డర్ ఏ కోర్టులోనూ పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలకు ఎలాంటి హాని కలిగించదు.
దీనిని టీటీడీలో జరిగిన నెయ్యి సరఫరా కుంభకోణంపై ప్రభుత్వం తీసుకుంటున్న తదుపరి చర్యగా చూడవచ్చు.
తిరుపతి లడ్డు కాంట్రవర్సీ ఎప్పుడు మొదలైంది?
తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ 2024లో మొదలైంది. టీటీడీలో ప్రసాదంగా ఇచ్చే ప్రసిద్ధ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ (అడల్టరేషన్) ఉందని, ముఖ్యంగా జంతు కొవ్వు (అనిమల్ ఫ్యాట్) మిశ్రమం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు నాసిరకం ఇచ్చాయని, దీనిలో బీఫ్ టాలో, పిగ్ లార్డ్ వంటి జంతు కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ టెస్టులు చూపించాయి అని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతరులు టెండర్లలో లోపాలు చేశారని టీడీపీ ఆరోపించింది. వైఎస్ఆర్సీపీ దీనిని రాజకీయ కుట్రగా పేర్కొంది. ఇది హిందూ మత భావాలను రెచ్చగొట్టి, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఎస్ఐటీ ఏర్పాటు అయింది. ఎస్ఐటీ దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ ఫైల్ చేసింది. టీటీడీ అధికారుల లోపాలపై చర్యలకు సిఫారసు చేయడానికి ఇప్పుడు ఈ జీవోలో ఒకే వ్యక్తి కమిటీ ఏర్పాటు చేశారు.
లడ్డూలు లక్షలాది భక్తులు తినేవి కాబట్టి ఇది ఆహార భద్రత, మత విశ్వాసాలు, పాలనా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తింది. టీటీడీ ఇప్పుడు నెయ్యి సరఫరా ప్రక్రియను కఠినం చేసింది. కానీ వివాదం ఇంకా కొనసాగుతోంది.
ఇది ఒక ఆహార కుంభకోణం నుంచి రాజకీయ, మతపరమైన గొడవగా మారింది. ప్రభుత్వాలు మారినా సమస్యలు పరిష్కరించడానికి దర్యాప్తులు కొనసాగుతున్నాయి.

