
పవన్ కల్యాణ్
మద్యం అమ్మకాలపై పవన్ గుస్సా, టీడీపీ వర్గాల్లో రచ్చ!
పవన్ స్పందన ప్రభుత్వానికి హెచ్చరికా? లేక రాజకీయంగా మరో కొత్త వివాదానికి దారితీస్తుందా?
ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం•మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు•ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 3, 2026
అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. మద్యం దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించిన ఆయన, సంబంధిత శాఖ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. అధిక ధరలకు విక్రయాలు జరిపేవారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కాకపోయినా, మద్యం విక్రయాలపై ఆయన స్పందన ఎందుకు వచ్చిందన్న అంశంపై ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి ఇతర శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
పవన్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో విభిన్న వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. కొందరు మద్యం ధరలపై చర్యలు తీసుకోవాలని కోరగా, మరికొందరు ఇది కేవలం పోస్టులతో సరిపోదని విమర్శించారు.
ఒక యూజర్ “ఉదయం 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు, మీ కూటమి ఎమ్మెల్యే నియోజకవర్గం కడపలో ఇదే పరిస్థితి” అని వ్యాఖ్యానించారు. మరో యూజర్ “జగన్ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మీరు చాలా మాట్లాడారు, ఇప్పుడు చేతకావడం లేదా?” అంటూ ప్రశ్నించారు.
మరికొందరు మద్యం విక్రయాల్లో స్థానిక సిండికేట్లు, అదనపు వసూళ్లపై ఆరోపణలు కూడా ప్రస్తావించారు. “ఎంఆర్పీపై 20-30 శాతం ఎక్కువగా అమ్ముతున్నారు, చర్యలు ఎక్కడ?” అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకొంత మంది “పక్క డిపార్ట్మెంట్‌లో ఎందుకు జోక్యం?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక మద్యం నాణ్యతపై కూడా కొందరు స్పందించారు. “ధరలే కాదు, క్వాలిటీ కూడా దారుణంగా ఉంది” అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం పరిపాలనా చర్యలు తీసుకుంటుందా?
పవన్ కళ్యాణ్ ట్వీట్ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దుకాణాలపై తనిఖీలు పెంచుతారా? అధిక ధరల విక్రయాలపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, కూటమి ప్రభుత్వంలో శాఖల సమన్వయం, అధికార పరిధి అంశాలు కూడా రాజకీయంగా చర్చకు వస్తున్నాయి.
మద్యం ధరలు, నాణ్యత, అక్రమ వసూళ్లపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి మధ్య పవన్ స్పందన ప్రభుత్వానికి హెచ్చరికగా మారిందా? లేక రాజకీయంగా మరో కొత్త వివాదానికి దారితీస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
ఎక్సైజ్ శాఖ స్పందన ఏమిటి?
ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కూడా అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
“ఎంఆర్పీ మించిన ధరలకు అమ్మితే చర్యలు” తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. ఈ ట్వీట్ తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించినట్లు సమాచారం. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగితే లైసెన్సులు రద్దు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
“ప్రతి మద్యం దుకాణంలో ధరల పట్టిక స్పష్టంగా ప్రదర్శించాలి. అదనపు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే వెంటనే తనిఖీలు నిర్వహిస్తాం” అని శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Next Story

