విశాఖలో సమీక్షలతో పవన్‌ కల్యాణ్‌ బిజీ బిజీ!
x
పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పవన్ కల్యాణ్

విశాఖలో సమీక్షలతో పవన్‌ కల్యాణ్‌ బిజీ బిజీ!

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణŠ సమీక్షలతో బిజీ బిజీగా ఉంటున్నారు.

రెండు రోజులుగా విశాఖ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రెండు కీలక సమీక్షలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీశాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సంబంధిత అధికారులకు తనవైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, సిఫార్సులు ఉండబోవని భరోసా ఇచ్చారు. మరోవైపు ఉత్తరాంధ్రలో కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయినా, నివారణకు ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాల్లో ఆయన ఏమన్నారంటే?

సమీక్షలో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

కాలుష్యం మనతో కలిసి జీవిస్తోంది..
‘కాలుష్యం మనతో కలిసి జీవిస్తోంది. అది మనలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంతవరకు కాలుష్యాన్ని భరించాలి. కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా నియంత్రించే ప్రయత్నం చేయాలి. పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉత్తరాంధ్ర తీరప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత కూడా తగ్గుతూ వచ్చింది. పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామంలో రసాయన కాలుష్యంతో ఇంటికొకరు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఆ ప్రాంత మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయి. పరిశ్రమల స్థాపనలో సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పరిశ్రమలు కాలుష్య నియంత్రణలో సరిగా నిబంధనలు పాటించవని, అన్ని రకాల కాలుష్యాలకు ఉత్తరాంధ్రను డంపింగ్‌ యార్డుగా మార్చేశారన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. పారిశ్రామికవాడల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టి వారి జీవితాలకు భరోసా కల్పించాలి.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష చేస్తున్న పవన్‌ కల్యాణ్‌

తూతూమంత్రంగా చర్యలొద్దు..
కాలుష్య నివారణలో తూతూమంత్రం చర్యలొద్దు. ప్రతి పరిశ్రమ 33 శాతం గ్రీన్‌ బెల్టు నిబంధనను పాటించాలి. తీరప్రాంతంలో మొక్కలతో గోడ నిర్మించేందుకు గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్టు తెచ్చాం. పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు ఈ మహాయజ్జంలో తమ వంతు పాత్ర పోషించాలి’ అని హితవు పలికారు.

కాలుష్యంపై జరిగిన సమావేశానికి హాజరైన పారిశ్రామికవేత్తలు, అధికారులు

నా నుంచి ఒత్తిళ్లు, సిఫార్సులుండవ్‌!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నా వైపు నుంచి రాజకీయ ఒత్తిడులు గాని, సిఫార్సులు కూడా ఉండవె, ప్రతి అధికారీ నిబంధనలకు లోబడే పనిచేయాలి. పనిలో అలసత్వాన్ని సహించను, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా కఠినంగా వ్యవహరిస్తాను.
హాజరైన పారిశ్రామికవేత్తలు, అధికారులు
నాకు చప్పట్లు, పొగడ్తలు అక్కర్లేదు..
‘గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఇంకా పాత నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ విధానాల అమలులో అలసత్వం వహిస్తే ఉపేక్షించను. ప్రజల సంతోషం, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ప్రభుత్వ ఆశయాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు చిత్తశుద్ధితో, జవాబుదారీతనంతో వ్యవహరించాలి. నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు. పని మాత్రమే కావాలి. ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్ట్‌ అసిస్టెంట్‌ వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలి.
గత పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం..
గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసి ఆర్థిక క్రమశిక్షణ లేకుండారూ. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. జల్‌ జీవన్‌ మిషనల్‌ లక్ష్యాన్ని నీరుగార్చి రూ.4 వేల కోట్లను వృధా చేసింది. పనులు చేసినట్టు రికార్డులు సృష్టించారు గాని ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాల్లేవు. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుకుంటూ, వ్యవస్థలను బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నాం.
పీఆర్‌ను ప్రభావవంతమైన శాఖగా మారుస్తా..
పంచాయతీరాజ్‌ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న పది వేల ప్రమోషన్లను ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పూర్తి చేసి చిత్తశుద్ధిని చాటుకున్నాం. ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఎంపీడీవోపై దాడి జరిగితే స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చాను. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నాం. కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నాం. తమ కష్టానికి సార్థకత చేకూరేలా అధికారులు పని చేయాలి’ అని పవన్‌ కల్యాణ్‌ అధికారులకు స్పష్టం చేశారు.
Read More
Next Story