
విశాఖకు వచ్చి ప్రాణాలు కోల్పోయింది
బస్సు ఢీకొని యూపీ విద్యార్థిని దుర్మరణం.
సరదాగా నగరాన్ని చుట్టేద్దామని వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్‌లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరు
కళాశాలకు సెలవులు కావడంతో వీరిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుక నుంచి వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. స్నేహితుడు చంద్రశేఖర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
పోలీసుల చర్యలు
సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉన్నత చదువులు చదువుతూ, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న విద్యార్థిని ఇలా అకస్మాత్తుగా మరణించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story

