
కంటతడి పెట్టించిన కన్నయ్య..ఎలుగు’బంటి‘ బంధం
ఆ ఎలుగుబంటి చూపుతున్న విశ్వాసం, ప్రేమ చూసి గ్రామస్థులు సైతం ఆశ్చర్యపోయేవారు.
క్రూర మృగాలంటే సాధారణంగా మనుషులు ఆమడదూరం పరుగెత్తుతారు. కానీ, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని దొరవలస గ్రామంలో మాత్రం ప్రకృతి సిద్ధాంతాలనే తిరగరాస్తూ ఒక ఎలుగుబంటి మనిషి కుటుంబంలో అంతర్భాగమైపోయింది. గత ఎనిమిది నెలలుగా గిరిజన రైతు గెమ్మెలి కన్నయ్య కంటికి రెప్పలా సాకిన ఆ ఎలుగుబంటి ’బంటి‘, అడవి మృగంలా కాకుండా ఆ ఇంటి బిడ్డలా పెరిగి ఆశ్చర్యపరిచింది. అయితే, వన్యప్రాణి చట్టాల దృష్ట్యా ఇటీవల అటవీశాఖ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని విశాఖ జూకు తరలించగా.. ఆ విడదీయలేని బంధాన్ని చూసి కేవలం కన్నయ్య కుటుంబమే కాదు, స్థానికులు, విధుల్లో ఉన్న అధికారులు సైతం కంటతడి పెట్టడం ఈ అరుదైన స్నేహానికి పరాకాష్టగా నిలిచింది.
కాఫీ తోటలో మొదలైన కన్నయ్య..బంటిల అపురూప బంధం
అది సుమారు ఏడాది క్రితం.. అరకులోయలోని దొరవలస కొండల అంచున ఉన్న తన కాఫీ తోటలో కన్నయ్య పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడే పొదల మాటున ఆకలితో అలమటిస్తూ, తల్లికి దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక బుజ్జి ఎలుగుబంటి పిల్ల ఆయన కంటపడింది. తల్లి ఎలుగుబంటి తన మిగతా పిల్లలతో కలిసి అడవిలోకి వెళ్లిపోగా, ఈ ఒక్క పిల్ల మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. మానవత్వం ఉన్న కన్నయ్య, ఆ పిల్లను సురక్షితంగా అడవిలోకి పంపాలని పదే పదే ప్రయత్నించాడు. కానీ, విధి మరోలా తలచింది. ఆ ఎలుగు పిల్ల అడవిలోకి వెళ్లడానికి నిరాకరించి, కన్నయ్య అడుగుజాడల్లోనే ఆయన ఇంటి వరకు వచ్చేసింది. నోరు లేని ఆ మూగజీవి చూపిన విశ్వాసానికి కన్నయ్య మనసు కరిగిపోయింది. ఇకపై అది అడవి మృగం కాదు.. తన ఇంటి బిడ్డ అని నిర్ణయించుకుని, తన గుండెలకు హత్తుకున్నాడు. అలా ఒక కాఫీ తోట వేదికగా, మనిషికి-మృగానికి మధ్య ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన స్నేహయాత్ర మొదలైంది.
కుటుంబ సభ్యురాలిగా బంటి..వెన్నంటి ఉండే నేస్తం
కన్నయ్య ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ ఎలుగు పిల్ల అతి తక్కువ కాలంలోనే ఒక మనిషిలా ఆ కుటుంబంలో కలిసిపోయింది. దానికి ప్రేమగా బంటి అని పేరు పెట్టుకున్న కన్నయ్య కుటుంబం, ఏనాడూ దానిని ఒక అడవి జంతువులా చూడలేదు. బంటికి ప్రతిరోజూ సుమారు 3 కిలోల అన్నం వండి పెడుతూ, పసిబిడ్డలా సాకారు. ఇక కన్నయ్య ఎక్కడికి వెళ్తే బంటి అక్కడ ప్రత్యక్షమవ్వాల్సిందే. ఆయన అడవికి వెళ్తే ఆయన వెంటే వెళ్లడం, రోజంతా ఆయన తోడుగా ఉండి సాయంత్రం వేళకు తిరిగి ఆయనతోనే ఇంటికి చేరడం బంటికి అలవాటుగా మారింది. ఇంటి సభ్యులతో కలిసి ఆడుకుంటూ, కన్నయ్య పిల్లలతో సందడి చేస్తూ గడిపేది కానీ, ఏ రోజూ ఎవరికీ చిన్న హాని కూడా తలపెట్టలేదు. ఆ ఎలుగుబంటి చూపుతున్న విశ్వాసం, ప్రేమ చూసి గ్రామస్థులు సైతం ఆశ్చర్యపోయేవారు. అలా ఎనిమిది నెలల పాటు ఆ గిరిజన గూడెంలో ఒక మూగజీవి మనిషితో పెనవేసుకున్న బంధం అందరినీ ఆకట్టుకుంది.
వైరల్ వీడియోలు.. అటవీశాఖ ఎంట్రీ..బ్రేక్ పడిన స్నేహబంధం
కన్నయ్య-బంటిల మధ్య ఉన్న ఈ అపురూప స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారాయి. మనిషితో ఎలుగుబంటి అలా కలిసి తిరగడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ వీడియోలు కాస్తా అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం క్రూర మృగాలను ఇంట్లో పెంచుకోవడం, వాటిని మచ్చిక చేసుకోవడం చట్టరిత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఎంత ప్రేమ ఉన్నా, వన్యప్రాణుల రక్షణ ముఖ్యం కావడంతో.. మార్చి చివరలో అటవీ సిబ్బంది హుటాహుటిన దొరవలస గ్రామానికి చేరుకున్నారు. నిబంధనలను వివరిస్తూ, కన్నయ్య కుటుంబం వద్ద ఉన్న బంటిని స్వాధీనం చేసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీంతో అప్పటివరకు సందడిగా సాగిన ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.
కన్నీటి వీడ్కోలు.. కదిలించిన బంటి బంధం
అధికారులు బంటిని తీసుకెళ్లేందుకు వాహనాన్ని సిద్ధం చేయగా, దొరవలస గ్రామంలో హృదయాన్ని మెలిపెట్టే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఎనిమిది నెలలుగా తమ ఇంటి వెలుగుగా, కన్నబిడ్డలా కలిసిపోయిన బంటిని విడిచి ఉండలేక కన్నయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విచిత్రమేమిటంటే.. ఆ ఎలుగుబంటి కూడా వారిని విడిచి వెళ్లడానికి నిరాకరిస్తూ, అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. కన్నయ్యను పట్టుకుని వెనుకకు లాగడం, వారితోనే ఉండాలని తపించడం చూసి అక్కడున్న అధికారులు సైతం చలించిపోయారు. భావోద్వేగాని గురైన అధికారులు కంటతటి పెట్టుకున్నారు. ’మేము చట్టం తెలియక పెంచుకున్నాం.. ఇది మాకు జంతువు కాదు, మా కుటుంబ సభ్యురాలు. జూలో ఉన్నా సరే, మా బంటి క్షేమంగా ఉంటే చాలు‘ అంటూ కన్నయ్య కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం అందరినీ కంటతడి పెట్టించింది. అలా మనిషికి, మృగానికి మధ్య పెనవేసుకున్న ఒక అపురూప స్నేహయాత్ర భారమైన హృదయాలతో, కన్నీటి వీడ్కోలుతో ముగిసింది.
విశాఖ జూలో బంటి.. వైద్యాధికారుల పర్యవేక్షణలో సురక్షితం
కన్నయ్య కుటుంబం నుంచి భారమైన హృదయాలతో వీడ్కోలు తీసుకున్న ఆ ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు ప్రత్యేక వాహనంలో సురక్షితంగా విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ కు తరలించారు. అడవి నుంచి వచ్చి మనుషుల మధ్య పెరిగిన బంటికి అక్కడ కొత్త వాతావరణం అలవాటు చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జూలోని జంతు వైద్యాధికారుల బృందం దాని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బంటి సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉందని అధికారులు ధృవీకరించారు. కన్నయ్య కుటుంబం తమ కళ్ల ముందు లేకపోయినా, జూలో ఇతర జంతువుల మధ్య బంటి సురక్షితమైన జీవితాన్ని గడుపుతుందని అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి.
Next Story

