సాగుకు ’స్వర్ణ‘ కాంతి.. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ పద్దు
x

సాగుకు ’స్వర్ణ‘ కాంతి.. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ పద్దు

రైతును రాజును చేయడమే లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది.. అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని మంత్రి ఆకాంక్షించారు. రైతును రాజును చేయడమే పరమావధిగా రైతన్న మీ కోసం అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. యువత మళ్లీ నాగలి పట్టాలంటే వ్యవసాయం ఒక లాభదాయక వృత్తిగా మారాలని, దాని కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

7.83 శాతం వృద్ధి.. దేశ ఉత్పత్తిలో ఏపీ దశ

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభమని పేర్కొన్న మంత్రి, ప్రస్తుత వృద్ధి రేటు 7.83 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏకంగా 10 శాతం ఉండటం గర్వకారణమన్నారు. ’స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనలో భాగంగా వార్షిక వృద్ధిని 15 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకోసం 11 ప్రధాన పంటలను ’గ్రోత్ ఇంజిన్ల'గా గుర్తించినట్లు తెలిపారు.

రైతు ఖాతాలోకి రూ.20 వేల భరోసా

ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందించేలా ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాది ఈ పథకం కింద రూ.6,600 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ధాన్యం సేకరణ బకాయిలను (రూ.1,674 కోట్లు) తాము అధికారంలోకి వచ్చాక చెల్లించి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు.

అగ్రి-టెక్ విప్లవం: సాగులో డ్రోన్లు, ఏఐ

సాంప్రదాయ సాగుకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ’ఫార్మర్ అగ్రిటెక్'లో భాగంగా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), రోబోటిక్స్ వంటివి ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు.

డ్రోన్ల హోరు: రూ.90.4 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 1,130 డ్రోన్ కేంద్రాల ఏర్పాటు.

యంత్రీకరణ: 50 శాతం రాయితీతో యంత్ర పరికరాల కోసం రూ.136 కోట్లు.

బిందు సేద్యం: ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా మైక్రో ఇరిగేషన్ పనులపై ప్రత్యేక దృష్టి.

క్షేత్రస్థాయిలో పొలం పిలుస్తోంది

కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా, రైతులకు అవసరమైన సలహాలు అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించగా, 6 లక్షల మందికి భూసార పరీక్ష పత్రాలను అందజేశారు. విత్తన రాయితీ, పెట్టుబడి రాయితీ కింద వందల కోట్ల రూపాయలు కేటాయించి సాగును పండుగలా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అచ్చెన్నాయుడు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

Read More
Next Story