
ఏఐటీయూసీ లోగో..
తిరుపతి: ఏప్రిల్ లో 18వ రాష్ట్ర మహాసభలకు సన్నాహాలు...
లోగో ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు
తిరుపతి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలకు మూడోసారి వేదిక కానుంది. ఏప్రిల్ 26 తేదీ నుంచి 29వ తేదీ వరకు మహాసభలు నిర్వహించడానికి మంగళవారం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు.
తిరుపతి నగరం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్ (సీపీఐ) కార్యాలయంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్ర శేఖరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథరెడ్డి మాట్లాడారు.
"తిరుపతి నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తాం. గతంలో 1988, 14వ మహాసభ 2014లో కూడా జరిగాయి" అని హరినాథరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల హక్కులు కాపాడుకునేందుకు ఉద్యమాలు మరింత ఉధృతం చేసేదిగా కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు
"డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ కార్మికుల చట్టాలను అణగదొక్కేందుకు మాత్రమే ముందు ఉన్నారు" అని హరినాథరెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, కాలరాస్తున్న కార్మికుల హక్కులు కాపాడుకునేందుకు బలమైన కార్యాచరణ సిద్ధం చేస్తామని హరినాథరెడ్డి చెప్పారు.
లోగో ఆవిష్కరణ
తిరుపతిలో నిర్వహించనున్న ఏఐటీయూసీ 18 రాష్ట్ర మహాసభల లోగోను ఆ సంఘం నేతలు ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, దేశంలో కార్మికవర్గం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ భజన చేయడానికి చంద్రబాబు ముందు వరస లో ఉన్నారనడానికి 8గంటల పని విధానం 10 గంటలకు మార్చడానికి అసెంబ్లీ లో తీర్మానం చేయడమే నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు P4 అంటూ ప్రైవేటీకరణ వైపు ప్రయాణిస్తున్నారని విమర్శించారు.
"44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తెస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం" అని వెంకటసుబ్బయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికుల ప్రయోజనాలు కాపాడే దిశలో తిరుపతి మహాసభల తీర్మానాలు ఉంటాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నాథ్ చెప్పారు. కార్మిక చట్టాల పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మహాసభల్లో తీర్మానాలు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. నాగసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి కే. రాధాకృష్ణ, తిరుపతి జిల్లా కార్యదర్శి పీ.మురళి మాట్లాడారు.
Next Story

