
వరుసగా తొమ్మిదో బడ్జెట్… దేశ ఆర్థిక దిశపై కీలక ప్రకటనలకు సిద్ధం
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఆర్థిక అంచనాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి.
ఫిబ్రవరి 1న దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం రాబోతోంది. యూనియన్ బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇదే తాజా అప్డేట్గా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు. అదేవిధంగా, ఆదివారం రోజున బడ్జెట్ చదివే తొలి ఫైనాన్స్ మినిస్టర్‌గా కూడా చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే 2020, 2025లో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఆమెకు ఉంది.
బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కాలక్రమంలో మారింది. 1999 వరకు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ చదివే ఆనవాయితీ కొనసాగింది. ఆ ఏడాది యశ్వంత్ సిన్హా ఉదయం పదకొండు గంటలకు మార్చగా, ఆ విధానం ఇప్పటికీ అమలులో ఉంది. తరువాత 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి చివరి నుంచి ఫిబ్రవరి 1కి ముందుకు తీసుకువచ్చారు.
యూనియన్ బడ్జెట్ 2026లో కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలు వెల్లడికానున్నాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాలు సవాళ్లుగా మారాయి.
ఈ పరిస్థితుల్లో ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతం దిగువకు తీసుకెళ్లాలన్న లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత బడ్జెట్లలో మౌలిక వసతులపై ఖర్చు పెరగగా, అదే ఊపు కొనసాగుతుందా అనే అంశంపై ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
బడ్జెట్‌కు ముందు పరిశ్రమ వర్గాలు తమ అంచనాలను వెల్లడించాయి. మౌలిక వసతులు, తయారీ రంగానికి మద్దతు కొనసాగించాలని సూచించాయి. టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్ అంశాల్లో స్పష్టమైన విధానాలపై దృష్టి పెట్టాలని కోరాయి.
ఎకనామిక్ సర్వే అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు సాధారణంగా కొనసాగనున్న నేపథ్యంలో, పన్నుల విధానం, రంగాల వారీ కేటాయింపులపై ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. మొత్తంగా చూస్తే, యూనియన్ బడ్జెట్ 2026 దేశ ఆర్థిక ప్రయాణంలో మరో కీలక మలుపుగా నిలవనుంది.
Live Updates
- 1 Feb 2026 10:14 AM IST
మరి కాసేపట్లో కేంద్ర క్యాబినెట్ సమావేశం
బడ్జెట్‌కు ముందు సమావేశం కావడానికి కేంద్ర మంత్రివర్గం సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. పార్లమెంట్‌కు చేరుకున్నారు.
మరికాసేపట్లో 10:15 గంటలకు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో పలు ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ఆమోదముద్ర వేసిన అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఆర్థిక మంత్రి బయలుదేరుతారు.
- 1 Feb 2026 9:01 AM IST
బడ్జెట్ డే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని ఎందుకు కలుస్తారు?
యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు, ఫిబ్రవరి 1 ఉదయం ఆర్థిక మంత్రి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన అధికారిక అనుమతిని రాష్ట్రపతి నుంచి పొందే ప్రక్రియగా ఇది కొనసాగుతోంది.
ప్రతి ఏడాది బడ్జెట్ రోజున ఈ సమావేశం తప్పనిసరిగా జరుగుతుంది. రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా, కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆదాయ–వ్యయ ప్రణాళికను పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లే ముందు రాష్ట్రపతి ఆమోదం అవసరం అవుతుంది. అందుకే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగానికి ముందే రాష్ట్రపతిని కలుస్తారు.
ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సంప్రదాయం కూడా ఉంది. రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి పెరుగు, చక్కెర అందిస్తారు. ఇది శుభప్రదంగా, మంచి ఆరంభానికి సూచనగా భావిస్తారు. ముఖ్యమైన బాధ్యతను చేపట్టే ముందు శుభాకాంక్షలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.
యూనియన్ బడ్జెట్ 2026 సందర్భంలోనూ ఈ సంప్రదాయం ఈ రోజు కొనసాగనుంది. రాష్ట్రపతి భవన్లో ఈ భేటీ పూర్తైన తర్వాతే ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు వెళ్లి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- 1 Feb 2026 8:20 AM IST
బడ్జెట్ 2026కు ముందు కీలక PLI గణాంకాలు
యూనియన్ బడ్జెట్ 2026కు ముందుగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ముఖ్యమైన సంఖ్యలు ఇలా ఉన్నాయి:
- ₹21,534 కోట్లు: 12 PLI పథకాల కింద ఇప్పటివరకు విడుదలైన ఇన్సెంటివ్ మొత్తం
- ₹16.5 లక్షల కోట్లకు పైగా: PLIతో అనుసంధానమైన మొత్తం ఉత్పత్తి విలువ
- 12 లక్షలకు పైగా ఉద్యోగాలు: ప్రత్యక్ష, పరోక్షంగా సృష్టించిన ఉపాధి
- కీలక రంగాలు: ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెలికాం, ఆటో, టెక్స్టైల్స్
- ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి (FY25): ₹11.3 లక్షల కోట్లు
- ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు (FY25): ₹3.3 లక్షల కోట్లు
ఈ గణాంకాలు తయారీ రంగానికి PLI స్కీమ్ ఎంత బలంగా తోడ్పడిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. బడ్జెట్ 2026లో ఈ పథకాలకు కొనసాగింపు లేదా కొత్త దిశ ఉంటుందా అనే అంశంపై పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
- 1 Feb 2026 8:14 AM IST
బడ్జెట్‌ను ఫెబ్రవరీ 1నే ఎందుకు ప్రవేశపెడతారు?
ప్రతి ఏడాది ఫిబ్రవరి 1 వ తేదీనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్‌పై చర్చించి దానిని అమలు చేయడం సులభతరం కావాలని. ఏప్రిల్ 1 లోపు బడ్జెట్ అమలు ప్రారంభమయితే.. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే బడ్జెట్ అమలవుతుంది.
ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలోని చివరి పనిరోజున ప్రవేశపెట్టేవారు. ఆ సాంప్రదాయం 2017లో మారింది. అప్పటి ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఈ తేదీలో కీలక మార్పు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు. ఈ సంస్కరణ ప్రభుత్వ స్కీమ్స్‌ను అమలు చేయడానికి, ఖర్చులను ప్లాన్ చేసుకోవడానికి మంత్రిత్వశాఖలకు మరింత సమయాన్ని అందించింది.
- 1 Feb 2026 8:07 AM IST
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రమంత్రి పియూష్ గోషల్ స్పందించారు. ఇది చాలా మంచి బడ్జెట్ కానుందని తెలిపారు. ఈ విషయంలో తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అన్నారు.
- 1 Feb 2026 8:04 AM IST
యూనియన్ బడ్జెట్ 2026: సవాళ్ల మధ్య సమతుల్య అజెండా
ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు తీవ్రంగా ఉన్న వేళ ఆదివారం రోజున యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయిపై ఒత్తిడి, దేశీయ డిమాండ్‌లో అసమానతల మధ్య ఈ బడ్జెట్ రావడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ప్రతిబింబంగా మారింది.
అమెరికా టారిఫ్ విధానాలు, భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, మార్కెట్ల అస్తిరత సమీప కాల ఆర్థిక దృశ్యాన్ని మసకబార్చుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వృద్ధి బాధ్యత ఎక్కువగా ప్రభుత్వంపై పడింది.
ఈ పరిస్థితుల్లో ప్రజా వ్యయమే వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖర్చుల ద్వారా డిమాండ్‌ను నిలబెట్టడం, ఆర్థిక చలనం కొనసాగించడం కీలకంగా మారింది.
అదే సమయంలో ఆర్థిక లోటు నియంత్రణ, అప్పుల తగ్గింపు లక్ష్యాలపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వృద్ధి ప్రోత్సాహం, ఆర్థిక క్రమశిక్షణ రెండింటి మధ్య సమతుల్యమే ఈ బడ్జెట్ ముందున్న అసలైన పరీక్షగా నిలిచింది.
మొత్తంగా, యూనియన్ బడ్జెట్ 2026 అనిశ్చితుల మధ్య స్థిరత్వాన్ని వెతికే ఆర్థిక ప్రయత్నంగా రూపుదిద్దుకోనుంది.

