
బయోఫార్మా రంగానికి రూ.10వేల కోట్ల ప్రోత్సాహం
కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
భారత్ బయోఫార్మా(Pharma) పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. 2026 కేంద్ర బడ్జెట్లో భాగంగా దేశాన్ని ప్రపంచ స్థాయి బయోఫార్మా హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.10వేల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కేటాయించారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆమె “బయోఫార్మా శక్తి” పేరుతో ఐదేళ్లపాటు అమలు చేయబోయే ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశీయ బయోఫార్మాస్యూటికల్ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, పరిశోధనలకు ఊతమివ్వడం, క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడం ప్రధాన లక్ష్యాలు. అంతర్జాతీయ బయోఫార్మా సిస్టమ్‌లో పోటీతత్వ దేశంగా భారత్‌ను నిలబెట్టడమే ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రతిపాదనలో దేశవ్యాప్తంగా 1,000 గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్ల నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల క్లినికల్ రీసెర్చ్ వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, విదేశీ ట్రయల్స్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, కొత్త ఔషధాలు, పరీక్ష ప్రక్రియలు వేగవంతం కావడానికి ఇది తోడ్పడనుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు కూడా పెరుగుతాయని అంచనా.
ఆరోగ్యరంగంలో మారుతున్న అవసరాల దృష్ట్యా బయోఫార్మా రంగానికి ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందని సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో వ్యాధుల స్వరూపం మారుతూ ఉండటంతో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజ్‌లు అధికమవుతున్నాయని, వీటి నివారణకు ఆధునిక చికిత్సలు, బయోలాజిక్స్, నిరంతర ఆవిష్కరణలు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బలమైన బయోఫార్మా తయారీ మౌలిక వసతులు నిర్మించడం అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ సంస్కరణల దిశగా తీసుకున్న చర్యలను కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. అన్ని రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడం, ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా ఇటీవల 350కి పైగా సంస్కరణలు అమలు చేసినట్లు తెలిపారు. “సంస్కరణల ఎక్స్‌ప్రెస్” సరైన దారిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
మొత్తంగా “బయోఫార్మా శక్తి” పథకం ద్వారా ప్రభుత్వం ఆరోగ్య రంగ పురోగతిని పారిశ్రామిక అభివృద్ధితో అనుసంధానిస్తూ, దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ రంగంలో కీలక ఆటగాడిగా నిలబెట్టే దిశగా ముందడుగు వేస్తోంది.

