
పరకాల 2024 ఆంధ్రా ఎన్నికల విశ్లేషణలో లోపాలున్నాయా?
పరకాల విశ్లేషణ...సంకల్పితమా ? వాస్తవమా ?
2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, 'ఓట్ ఫర్ డెమోక్రసీ' నివేదిక మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ శాతం మరియు గణాంకాలపై పరకాల ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. అనేక వేదికలపై ఆయన లేవనెత్తిన అంశాలు ప్రజాస్వామ్య ప్రక్రియలోని పారదర్శకతను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను కేవలం రాజకీయ కోణంలో కాకుండా, శాస్త్రీయంగా, వ్యవస్థాగతంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాసం గణాంక శాస్త్రం (Statistics), ఎన్నికల చట్టాలు మరియు క్షేత్రస్థాయి వాస్తవాలను జోడిస్తూ సాగుతుంది.
1. పరకాల ప్రభాకర్ విశ్లేషణలోని ప్రధాన అంశాలు :
పరకాల ప్రభాకర్ గారు ప్రధానంగా 'ఓట్ ఫర్ డెమోక్రసీ' (Vote for Democracy) నివేదికను ఉటంకిస్తూ మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టారు:
1.అదనపు ఓట్లు : 2024లో సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ రేటు నమోదు అయ్యిందని, పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఉన్న గణాంకాలకు, తుది గణాంకాలకు మధ్య దాదాపు 49 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది.
2. పోలింగ్ పెరుగుదల : 6 గంటలకు ప్రకటించిన సుమారు 68-70% పోలింగ్, ఆ తర్వాత రాత్రి 11:45కి 76.50%, చివరకు 81.79–81.86% వచ్చి అని ఎలక్షన్ కమిషన్ తెలిపిందని పేర్కొన్నారు.తుది నివేదిక వచ్చేసరికి 81.86% కి చేరడం అసాధారణం అని ఆయన వాదన.
3. డేటా జాప్యం : పోలింగ్ ముగిసిన తర్వాత కూడా డేటా విడుదల చేయడంలో ఎలక్షన్ కమిషన్ (ECI) ఎందుకు జాప్యం చేసింది ? ఈ సంఖ్యలు సాయంత్రం ముగిసిన తర్వాత అవాంతరంగా పెరిగినట్టు, ఇది సాధారణ లాజిక్‌కు విరుద్ధంగా ఉందని వాదిస్తున్నారు.
శాస్త్రీయ కారణాలు :
గణాంక శాస్త్రం ప్రకారం, ఒక ట్రెండ్ ముగిసే సమయంలో వచ్చే మార్పులు 'అవుట్‌లయర్స్' (Outliers) కావు, అవి ఒక ప్రక్రియలో భాగమే. క్యూ లైన్ డైనమిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2024 మే 13న తీవ్రమైన ఎండలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు సాయంత్రం 4 గంటల తర్వాతే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 6 గంటలకు లైన్‌లో ఉన్నవారికి టోకెన్లు ఇవ్వడం వల్ల రాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరిగింది. సింక్రొనైజేషన్ లాగ్ అనగా ప్రిసైడింగ్ అధికారులు ఓటర్ టర్నవుట్ యాప్‌లో డేటా అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రతి నిమిషానికి అప్‌డేట్ చేయలేరు. పోలింగ్ స్టేషన్‌లో రద్దీ తగ్గాక లేదా పోలింగ్ ముగిశాక ఒకేసారి పెద్ద మొత్తంలో డేటా అప్‌లోడ్ చేసినప్పుడు 'జంప్' కనిపిస్తుంది, వ్యవస్థాగత భద్రతలో ఏజెంట్లు మరియు ఫామ్ 17C పాత్ర చాలా ముఖ్యమైంది.
పారదర్శకత ఎక్కడ ?
పరకాల ప్రభాకర్ గారు ఒక ప్రసిద్ధ ఆర్థికవేత్త మరియు విశ్లేషకులు. ఆయన ప్రశ్నలు 'పారదర్శకత' అనే సంకల్పంతో వచ్చి ఉండవచ్చు, కానీ వాటికి క్షేత్రస్థాయిలో సాక్ష్యాలు లేనప్పుడు అవి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రాజకీయ కోణం , ఓడిపోయిన పార్టీలు ఈ అంకెలను అడ్డం పెట్టుకుని తమ ఓటమిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.అఫీషియల్స్ స్పందన, ఎన్నికల అధికారులు మరియు కలెక్టర్లు ఈ డేటాను నియోజకవర్గాల వారీగా స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు మరియు సర్వీస్ ఓటర్లను కలిపినప్పుడు తుది సంఖ్య మారుతుందని వారు వివరించారు.
చర్చాంశం :
పరకాల ప్రభాకర్ వ్యాసం ఒక 'మెథడలాజికల్ అనాలిసిస్' (Methodological Analysis) గా బాగుంది కానీ, అది ఎన్నికల ఫలితాన్ని తప్పు పట్టేంత బలమైన సాక్ష్యం కాదు. విశ్లేషణకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డంకి ఫామ్ 17C (Statutory Form 17C). పోలింగ్ స్టేషన్ క్లోజ్ కాగానే, అందులో పోలైన మొత్తం ఓట్ల లెక్క (ఉదాహరణకు 1,200 ఓట్లు ఉంటే 1,200) ఫామ్ 17Cలో రాస్తారు. అక్కడ ఉన్న అన్ని పార్టీల ఏజెంట్లు దీనిపై సంతకాలు చేస్తారు. ఈ ఫామ్ ప్రతి అభ్యర్థి వద్ద ఉంటుంది. కౌంటింగ్ రోజున EVM లో ఉన్న ఓట్ల సంఖ్య, ఈ ఫామ్‌లో ఉన్న సంఖ్యతో తేడా వస్తే (ఒక్క ఓటు తేడా వచ్చినా), అభ్యర్థి వెంటనే రీ-కౌంటింగ్ కోరవచ్చు లేదా కోర్టుకు వెళ్ళవచ్చు.ఎన్నికల ప్రక్రియలో డేటా నిర్వహణలో లోపాలు ఉండవచ్చు, కానీ 'ఓట్ల చోరీ' జరిగిందనడానికి క్షేత్రస్థాయిలో సంతకం చేసిన డాక్యుమెంట్లు (Physical Evidence) ఏవీ దొరకలేదు.అభ్యర్థులు మరియు ఏజెంట్లు మౌనంగా ఉన్నారంటే, క్షేత్రస్థాయిలో వారు పారదర్శకతను గుర్తించారని అర్థం.ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క అభ్యర్థి లేదా ఏ ఒక్క ఏజెంట్ కూడా తమ దగ్గర ఉన్న 17C ఫామ్ లెక్కలకు, ECI ప్రకటించిన లెక్కలకు తేడా ఉందని అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడం అత్యంత కీలకం.
ప్రజాస్వామ్య బాధ్యత :
ఎన్నికలు ప్రజాస్వామ్య గుండె చప్పుడు, ప్రశ్నలు అవసరం, కానీ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కూడా అవసరం. డేటా లేకుండా అనుమానం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. డేటాతో చేసిన విమర్శ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.ప్రశ్నించడం తప్పు కాదు. కానీ నిర్ధారణ లేకుండా వ్యవస్థపై అనుమానాన్ని పెంచడం ప్రమాదకరం. ఎన్నికలపై అనుమానం కలిగితే, అది ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, ప్రజాస్వామ్య నైతిక బలం బలహీనమవుతుంది.
Next Story

