
మన దేశానికి వాళ్ళిద్దరూ చెప్పింది అర్ధమైతే...
‘చారియట్స్ ఆఫ్ ఫైర్’ (Chariots of Fire:1981) ఎందుకు చూడాలి?
క్రిస్మస్ ఇండియాలో కూడా ఫక్తు మార్కెట్ పండగ అయ్యాక, యాడ్ ఏజెన్సీల నుంచి ఎయిర్ లైన్స్ వరకు అందరూ అందుకు తగ్గట్టుగా ఈ సీజన్ రాగానే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. బిజెనెస్ లో ‘ఇది ఏ భక్తుని రూపాయి?’ అనేది ఉండదు కనుక, రేపు ‘క్వార్టర్-3’ లెక్కలో అది ఎటూ కలిసిపోతుంది. మరి ఈ పండగను ఆచరించే భారతీయ క్రైస్తవులు 2025 చివరి నాటికి ఏమి చేస్తున్నారు.
గత ఏడాదిని అలా చూడడానికి 2024 ఎలక్షన్ ఇయర్ అయిపోయింది. అలా అనుకుంటే, రెండేళ్లనాడు మణిపాల్ అల్లర్లు వైపు మనం చూసాము. ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఆ చూపు బిజెపి ‘కూటమి’ పాలిత రాష్ట్రాలలో అమలు అవుతూ దేశమంతా విస్తరిస్తున్న- ‘యాంటి కన్వర్షన్ బిల్’ వైపుకు ఆ చూపు మారింది. అయినా ఇలాగే ఈ 2025 ముగుస్తుంది అనుకుంటే, ఈ ‘క్రిస్మస్’ సీజన్ కంటే ముందే ఊహించనివి రెండు జరిగి, ఆ ‘యాంటి కన్వర్షన్ బిల్’ పరుగు వేగానికి బ్రేకులు పడే పరిస్థితి వచ్చిందా అనిపిస్తున్నది.
ప్రస్తుతం మన దేశంలో ‘యాంటి కన్వర్షన్ లా’- ఒడిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ఘర్, ఝార్ఖండ్, హర్యానా రాష్ట్రాలలో అమలులో ఉంది. రాజస్థాన్ అదే దారిలో ఉంది. హోంశాఖ రాష్ట్రాల జాబితా అంశం కనుక, దీని అమలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలా ఉంది. కర్ణాటకలో అది గతంలోనే ఉన్నా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దక్షణాన- కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందుకు అలిమికానివి.
ఇలా ఉండగా హఠాత్తుగా జరిగింది ఇది. ఆ రోజు దేశంలో చిన్నాపెద్దా అంతా ఉద్విగ్నతతో టీవీలకు అతుక్కుపోయిన క్షణాల్లో ఒక క్రికెట్ స్టేడియంలోని ‘లైవ్’ కెమెరాల ముందు ‘జీసస్’ అని వినిపించడంతో చలిపిడుగు తమ ‘డ్రాయింగ్ రూమ్’లో పడినట్టుగా ‘భారత్’ గా మారుతున్న ఇండియా ఉలిక్కిపడింది! జరిగింది ఏమిటని అటు చూస్తే, అక్కడున్నది 2025 ఐసీసీ ‘ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఇండియాను గెలిపించిన- జేమీమా రోడ్రిగ్స్. అంతే, క్షణాల్లో ఆమె విశ్వాస నేపధ్యం ఏమిటని ప్రపంచమంతా పలు కోణాల్లో ‘స్కాన్’ చేయబడింది. జరిగింది ఏమిటో ఆమె చాలా సాదాసీదాగా చెప్పింది. “ఆటలో భరించలేనంత ఒత్తిడి ఎదురవుతున్నప్పుడు, ఆ క్షణాల్లో- ‘Just stand stil, God will fight for you’ (Exodus 14:14). ‘నువ్వు అలా నిలబడు, నీ దేవుడు నీకోసం పోరాడుతాడు’ అనే బైబిల్లోని వాక్యం ఆట అడుతూనే, నాకు నేనే పదేపదే చెప్పుకున్నాను” అందామె.
బైబిల్ లోని నిర్గమకాండం 14:14 లోనిది ఆ వాక్యం. అంతే స్టేడియంలో జేమీమా ఇచ్చిన జవాబు- ‘ఏమి జరుగుతుంది ఇండియాలో?’ అనే మూకుమ్మడి మౌనప్రశ్నకు కారణమైంది. క్రైస్తవేతరులే కాదు కొందరు క్రైస్తవులు కూడా ఈ అనుమానం వచ్చింది. నిలకడతో కూడిన బలమైన క్రైస్తవ విశ్వాసం, ‘చర్చి’తో పనిలేని ఒక ‘యాటిట్యూడ్’ అని తెలుగు సువార్త బోధకుడు ప్రొ. ప్రకాష్ గంటెల వంటివారు యువతరానికి బోధిస్తున్నది ఏమిటో; కఠినమైన పరీక్ష ఎదురైనప్పుడు ‘ప్రాక్టికల్’గా అది ఎలా పని చేస్తుందో దేశానికి, క్రైస్తవ యువతకు కూడా జేమీమా రోడ్రిగ్స్ చూపించింది.
ఆమె దాన్ని పనిమాలా పైకి అనకపోవచ్చు, కానీ ఆమె చెప్పింది ఏమంటే- అడ్డుగా ఎవరో కొత్త గోడలు కడితేనో, లేదా ఉన్నవి పడదోస్తేనో- వచ్చేది పోయేది ‘విశ్వాసం’ కాదని, ఆమె దాన్ని దేశం ముందు చూపి మరి ఋజువు చేసింది. ఈ దేశం ప్రతిష్ట కోసం చివరి చెమట చుక్క ఇంకే వరకు నిలిచేది ఏ ఒక్కరో కాదు, అది అందరూ అందామె! మీడియా ప్రత్యక్ష ప్రసారాలలో ఆమె కార్చిన చివరి చెమటను చూసిన దేశం దాన్ని కాదనలేక పోయింది. చివరికి ఇండియా గెలిచి ‘వరల్డ్ కప్’ స్వంతం చేసుకుంది.
ఈ ఇద్దరిలో రెండవవారు భారత సైన్యాధికారి లెఫ్ట్నెంట్ శామ్యూల్ కమలేషన్. బెంగుళూరుకు చెందిన ప్రొటెస్టెంట్ క్రైస్తవుడైన శామ్యూల్ వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి తెలియదు. ప్రభుత్వం ఆయన్ని తన విశ్వాసం కారణంగా, ‘మిలటరీ సర్వీస్’లో క్రమశిక్షణ పాటించకపోవడం అంటూ ‘డిస్మిస్’ చేశాక అయినా, శామ్యూల్ వివరాలు, ఫోటో కూడా ‘గూగుల్లో’ కూడా దొరకలేదు. ఒక క్రైస్తవ విశ్వాసిగా తన జవాబుదారీతనం ఎవరికి? అనే విషయంలో ఆయనకున్న స్పష్టత అది.
అలాగని సత్యాన్ని గోప్యంగా లోపల దాచిపెడితే, అది నిప్పుల్ని గుడ్డలో దాయడం వంటిది అవుతుంది. చివరికి అదే జరిగింది. శామ్యూల్ ను ‘డిస్మిస్’ చేస్తూ డిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. అలా కొత్త చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చిన తొలి తీర్పు పత్రికల పతాక శీర్షిక అయింది. ఆ వార్త వెలువడిన మూడవ రోజున సుప్రసిద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్ సంజయ్ హెగ్డే- ‘The Kmalesan case and its simple lesson’ శీర్షికతో ప్రముఖ ఆంగ్లపత్రికలో ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశారు.
అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు ఇవి- లెఫ్ట్నెంట్ శామ్యూల్ పనిచేస్తున్న రెజిమెంట్లో గుడి, గురుద్వారా ఉన్నాయి. ఆ సైనిక బృందం విధుల్లో భాగంగా వాటిలో చేయాల్సిన ఆరాధన సమయంలో శామ్యూల్ కూడా వాళ్ళతోపాటు తన బూట్లు తీసి, తెల్ల రుమాలు తలకు కట్టుకుని వారితో కలిసి లోపల ఉన్నప్పటికీ, గర్భాలయం లోకి ప్రవేశించి అక్కడ ఆయన మొక్కలేదు. ఆ ట్రూప్ లీడర్ గా ఆయన చేయాల్సింది నిరాకరించారు కనుక, ఇండియన్ ఆర్మీ శామ్యూల్ ను సర్వీస్ నుంచి ’డిస్మిస్’ చేసింది.
ఆయన డిల్లీ హైకోర్టుకు వెళితే, ఆ శిక్షను కోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై తన వ్యాసంలో సంజయ్- “రెండు సమర్ధనీయమైన అంశాల మధ్య వచ్చిన ఘర్షణలో రెండింటికీ చోటు లేదా ఏదో ఒక్కటే ఉండాలా?” అంటారు. అటువంటి చోట సర్దుబాటుకు వ్యవస్థలు పూనుకోకపోవడం విషాదం అంటారాయన. “When duty meets conscience, the real test lies in finding a way for both to coexist”
చరిత్రలోకి వెళితే- క్రైస్తవ విశ్వాసి అయిన ఎరిక్ హెన్రీ లెడ్డిల్ (1902-1945) మంచి క్రీడాకారుడు. చైనాలో మిషనరీ టీచర్ గా పనిచేస్తూ ఆయన చనిపోయారు. పారిస్ 1924లో జరిగిన ఒలంపిక్స్ క్రీడలలో ఆదివారం 100 మీటర్లు పరుగు చేయడానికి హెన్రీ నిరాకరించాడు. దాంతో ఒలంపిక్స్ కమిటీ తన షెడ్యూల్లో చిన్నసర్దుబాటు చేస్తే, హెన్రీ 400 మీటర్ల పరుగులో ఏకంగా ‘గోల్డ్ మెడల్’ సాధిస్తాడు. సంజయ్ తన వ్యాసంలో చరిత్రలో ప్రముఖమైన ఆ పాత సంగతిని, హెన్రీ వాస్తవ సంఘటనతో 1981 లో హ్యూగ్ హడ్సన్ తీసిన సినిమా ‘చారియట్స్ ఆఫ్ ఫైర్’ (Chariots of Fire:1981) గురించి ఇక్కడ మనకు గుర్తుచేస్తారు.
“ఆనాడు ఒలంపిక్స్ కమిటీ చేసిన పని, ఒకరి నిజయతీతో కూడిన విశ్వాసాన్ని గౌరవించడానికి మన ఆర్మీ ఎందుకు చేయలేకపోయింది?” అని ఆయన తన వ్యాసంలో ప్రశ్నిస్తున్నాడు.
“భారతీయ సైన్యంలోని ఐక్యత ఏనాడూ అధిక సంఖ్యాకులను సౌకర్యవంతంగా ఉంచడం పైన నిర్మితం కాలేదు. అది నమ్మకం (ట్రస్ట్) పై నిలబడింది. ఇండియాలో సిక్కులు, ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు ఐక్యంగా పోరాడి 1965,1971 యుద్దాలలో భారత్ కు గెలుపు సాధించారు. కార్గిల్లోనూ అదే చూసాము. మనదేశ సరిహద్దుల్లో మన సైన్యం ఐక్యంగా నిలుస్తున్నది. అయినా మన సైన్యానికి కానీ, కోర్టులకు కానీ మనం ఉద్దేశ్యాలు అపాదించలేము, అయినా మనకు తెలియకుండానే ఒక్కోసారి ఇలా తప్పుడు సందేశం బయటకు వెళుతుంది” అంటారు సంజయ్ తన వ్యాసంలో.
ఇది జరిగాక, లెఫ్ట్నెంట్ శామ్యూల్ కమలేషన్ మౌనం ఇక్కడ మనం గుర్తించి మరీ గౌరవించాల్సిన అంశంగా మారింది. ఆయన తన వాదనతో ‘మీడియా’ ముందుకు రాలేదు. జరిగే పర్యవసానాలు పూర్తిగా తెలిసే ఆయన అలా ప్రవర్తించారు అని ఇదంతా చూశాక, ఇప్పుడు మనకు అర్ధంఅవుతున్నది. అది తను నమ్ముతున్న విశ్వాసానికి సంబంధించిన విషయం అనే స్పష్టత అందులో కనిపిస్తూనే ఉంది. శామ్యూల్ కు కౌన్సిలింగ్ ఇవ్వమని ఆర్మీ పిలిపించిన చర్చి పాస్టర్ చెప్పిన సలహాను ఆయన వినలేదు. తన నిర్ణయం విషయంలో ఆయన ‘బైబిల్’ కు ప్రాధాన్యత ఇచ్చారు. తన మౌనంతో దేశానికి శామ్యూల్ ఇచ్చిన సందేశాన్ని అర్ధం చేసుకోవడానికి సతమతం అవుతున్నాము. కారణం- మనకు మతం ఒక్కటే తెలుసు, విశ్వాసం గురించి తెలియదు.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత వ్యక్తి గత అంశాలు అని గమనించాలి)

