
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచార దృశ్యం (ఫైల్ ఫోటో)
498 ఓట్లలో 204 చెల్లనివా! లాయర్ల వృత్తిప్రమాణాలపై అనుమానాలెన్నో?
న్యాయవాదులు సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులు, అలాంటి వారు ఓటు వేసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఏమిటనే ప్రశ్న వస్తోంది.
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆందోళన కలిగించే అంశం బయటపడింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొత్తం 498 ఓట్లలో 204 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాదాపు 41 శాతం ఓట్లు చెల్లకుండా పోవడం చిన్న విషయం కాదని బార్ అసోసియేషన్ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం న్యాయవాద వృత్తిపైనే సందేహాలు లేవనెత్తేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం మాత్రమే
ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు నేతృత్వంలో బుధవారం కౌంటింగ్ మొదలైంది. ఇప్పటివరకు 2 బాక్స్‌ల్లోని సుమారు 498 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇందులో చెల్లని ఓట్లు 204 దాకా ఉండగా, 294 ఓట్లు చెల్లుబాటయ్యాయి. దాదాపు 41 శాతం ఓట్లు చెల్లకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు 23 మంది సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా ఇందులో మహిళలు తప్పనిసరిగా అయిదుగురు ఉండాలి. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో బార్ కౌన్సిల్ సభ్యుల పోస్టుల కోసం 203 మంది న్యాయవాదులు పోటీ పడ్డారు.
న్యాయవాద వృత్తి నాణ్యతపై ప్రశ్నలెన్నో..
ఈ పరిణామం న్యాయవాద వృత్తిపైనే సందేహాలు లేవనెత్తేలా ఉందని వ్యాఖ్యానించారు కృష్ణాజిల్లా బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు శేషగిరిరావు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో 1 నుంచి 23 వరకు స్పష్టంగా, సరైన క్రమంలో సంఖ్యలు నమోదు చేయాలి. అయితే 204 మంది లాయర్లు ఆ ప్రాథమిక విధానాన్ని సరిగా పాటించలేకపోయినట్లు తేలింది. సంఖ్యల క్రమం తప్పడం, ఒకే సంఖ్యను రెండుసార్లు నమోదు చేయడం, సూచనలు పాటించకపోవడం, ఒకటి నుంచి 23 వరకు ఇంగ్లీషులో రాయలేకపోవడం వంటి కారణాలతో ఓట్లు చెల్లకపోయినట్లు సమాచారం. జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 109 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. తొలిరోజు కేవలం రెండు బ్యాలెట్ బాక్సులను మాత్రమే తెరిచారు. ఈ రెండు బాక్సుల్లో మొత్తం 498 ఓట్లు ఉండగా, అందులో 294 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. మిగిలిన 204 ఓట్లు (41%) చెల్లనివిగా ప్రకటించారు. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇది కేవలం ఓటింగ్ పొరపాటేనా?
బార్ కౌన్సిల్ ఎన్నికలు సాధారణ మెజారిటీ విధానంలో జరగవు. ఇవి “ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్” (Single Transferable Vote) ప్రకారం జరుగుతాయి. ఓటరు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో సంఖ్యలు నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో స్పష్టత, క్రమబద్ధత అత్యంత కీలకం. అయితే దాదాపు 41 శాతం ఓట్లు చెల్లకపోవడం కేవలం సాంకేతిక లోపంగా చూడాలా? లేక న్యాయవాదుల ప్రాథమిక అవగాహనపై ప్రశ్నగా పరిగణించాలా? అనే చర్చ మొదలైంది.
తలెత్తుతున్న ప్రశ్నలు
ఒకటి నుంచి 23 వరకు క్రమబద్ధంగా నమోదు చేయలేని స్థితి ఎందుకు?
ఇలాంటి లాయర్లు కోర్టులో పిటిషన్లు, వాదనలు ఎలా సిద్ధం చేస్తారు?
చట్టపరమైన సెక్షన్లు, రాజ్యాంగ అంశాలు ఎలా ఖచ్చితంగా ప్రస్తావిస్తారు?
క్లయింట్ల హక్కులను ఎలా సమర్థంగా రక్షిస్తారు?
న్యాయవాది కేవలం వృత్తి నిపుణుడు కాదు. ఒకరి స్వేచ్ఛ, ఆస్తి, జీవితం కోసం వాదించే వ్యక్తి. అలాంటి వృత్తిలో ప్రాథమిక క్రమబద్ధత లోపం కనిపిస్తే, కోర్టులను ఆశ్రయించే సామాన్యుల్లో ఆందోళన కలగడం సహజమని ఈ ఎన్నికల్లో పోటీ పడ్డ మరో సభ్యుడు (పేరు రాయడానికి ఇష్టపడలేదు).
బార్ కౌన్సిల్ పాత్ర ఏమిటి?
Advocates Act, 1961 ప్రకారం ఏర్పడిన బార్ కౌన్సిల్ న్యాయవాదుల వృత్తిని నియంత్రించే సంస్థ. న్యాయవాదుల నమోదు, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ నిర్వహణ, వృత్తి నైతిక ప్రమాణాల పర్యవేక్షణ,
క్రమశిక్షణ చర్యలు, లా కాలేజీల ప్రమాణాల పర్యవేక్షణ వంటి బాధ్యతలను బార్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. న్యాయమూర్తులకు బార్ కౌన్సిల్ సలహా మండలిగా కూడా వ్యవహరిస్తుంది. అలాంటి సంస్థ ఎన్నికల్లోనే ప్రాథమిక లోపాలు బయటపడటం ఆందోళనకరం.
వ్యవస్థలో లోపమా?
న్యాయవాదులు సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులు, అలాంటి వారు ఓటు వేసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఏమిటనే ప్రశ్న వస్తోంది. కొంతమంది ఇది ఓటింగ్ శిక్షణలో లోపమని అంటున్నారు. మరికొందరు నిర్లక్ష్యాన్ని కారణంగా చూపుతున్నారు. అయితే 204 ఓట్లు చెల్లకపోవడం వ్యవస్థాగత సమస్యకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లా కాలేజీల్లో బోధన ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
బార్ కౌన్సిల్ నమోదు ముందు అర్హత పరీక్షలు కఠినంగా ఉన్నాయా?
నిరంతర న్యాయ విద్యపై దృష్టి ఉందా? అన్న ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.
ఈ గణాంకాలు కేవలం ఎన్నికల ఫలితం కాదు- న్యాయ వృత్తి నాణ్యతపై ఒక హెచ్చరిక సంకేతం. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలవాలంటే, న్యాయవాదుల వృత్తి ప్రమాణాలు బలంగా ఉండాలి.
498లో 204 ఓట్లు చెల్లకపోవడం- ఒక సంఖ్య మాత్రమే కాదు, వ్యవస్థను సమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న సంఘటనగా మారింది.
Next Story

