
చిత్తూరు.. పుత్తూరు మార్గంలో జరిగిన ప్రమాదం
చిత్తూరు వద్ద ప్రమాదానికే.. ప్రమాదం..
బోల్తా పడిన లారీ డ్రైవర్ ను కాపాడుతున్న వారిపై బస్సు దూసుకుపోయింది.
రోడ్డుపై ఓ లారీ బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ ను కాపాడేందుకు గ్రామస్తులు రంగంలోకి దిగారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు గ్రామస్తులపై దూసుకుపోయింది. ప్రమాదానికే ప్రమాదం జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారు సకాలంలో చికిత్స అందని స్థితిలో ఒకరు మరణించార. మరొకరిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా గంగాథరనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం వద్ద శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
చిత్తూరు నుంచి పుత్తూరు మధ్య ఉన్న కార్వేటినగరం మండలం ఆర్కే. పేట వద్ద ఆయిల్ పాకెట్లు తీసుకుని వెళుతున్న లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. గమనించిన ఆర్కేపేట గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీలో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ ను కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుపై పడిన లారీ, జనం గుమిగూడి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో
దూసుకువచ్చిన బస్సు
ప్రమాదానికి గురైన లారీ డ్రైయివర్ కాపాడే యత్నంలో ఉన్న గ్రామస్తులపైకి తిరుపతి నుంచి పళ్లిపట్టుకు వెళ్లే ఆర్టీసీ బస్సు దూసుకునిపోయింది. దీంతో గ్రామస్తులు హాహాకారాలు చేస్తూ పరుగులు దీశారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. వెంటనే వారిని కార్వేటినగరం సీహెచ్ సీకి తరలించారు.
సకాలంలో చికిత్స అందక..
ఆర్టీసీ బస్సు దూసుకునిపోయిన ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి కార్వేటినగరం సీహెచ్సీలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల సకాలంలో చికిత్స అందని కారణంగా రామలింగం (65) ఆస్పత్రిలో మరణించాడు. గిరిబాటు చావుబతుకుల మధ్య కొట్టాడాడు. ఆయనకు కూడా చికిత్స అందని స్థితిలో గ్రామాస్తులు నిరసనకు దిగారు
గ్రామస్తుల ఆగ్రహం...
కార్వేటినగరంలో ఇంతపెద్ద ఆస్పత్రి ఏర్పాటు చేసి, డాక్టర్లను నియమించినా అందుబాటులో ఉండరా? అని గ్రామస్తులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. డాక్టర్లు ఉండడానికి కూడా వసతులు ఏర్పాటు చేసినా, ఎందుకు అందుబాటులో ఉండరు? పట్టణాలకే పరిమతం అయితే.. సిబ్బంది ఏమి చేయగలరు? అంటూ గాయాలతో తల్లడిల్లుతున్న గిరిబాబు పరిస్థితిని చూస్తూ ఓ యువకుడు ఫోన్ లో తీవ్ర స్వరంతో మాట్లాడారు.
"డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరు చనిపోయారు. ఇంకో బాధితుడినైనా కాపాడండి" అని ప్రాథేయపడ్డారు. అందుబాటులోని నర్సింగ్ సిబ్బంది గిరిబాబుకు చికిత్స చేయడానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉం డడంతో గిరిబాబుకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు, పుత్తూరు మార్గంలో ప్రమాదం జరిగిన సమాచారం అందించినా 108 వాహనం కూడా సకాలంలో రాలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ప్రాంతం తమిళనాడుకు సరిహద్దులో ఉండడం, ప్రమాదాలు ఎక్కువ జరిగే మార్గం కావడం వల్ల తరచూ ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
Next Story

