దీక్షిత్ ఓ సూపర్ హీరో
x

దీక్షిత్ ఓ 'సూపర్ హీరో'

కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని 5వ తరగతి విద్యార్థి ప్రాణాపాయం నుంచి కాపాడాడు.


సాధారణంగా పెద్దవారు సైతం కంగారుపడే కరెంట్ షాక్ ప్రమాదం నుంచి తన కన్నతల్లిని ఒక ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి చాకచక్యంగా కాపాడుకున్న అసాధారణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. కరెంట్ ప్రమాదం నుంచి తల్లి, కుమారుడు సేఫ్ గా బయట పడ్డారు. ఆడుతూపాడుతూ తిరిగే వయసులో ఈ బాలుడు ప్రదర్శించిన ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని అందరూ ప్రశంసిస్తున్నారు. దీంతో ఆ బాలుడు అటు అన్లైలోను, ఇటు ఆఫ్ లైన్లోను హీరో ఒక్క సారిగా హీరో అయిపోయాడు.

జొన్నలగరువులో ఘటన

భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరిగింది. అందులో భాగంగా జొన్నలగరువు ప్రభుత్వ పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. జొన్నలగరువు ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న దీక్షిత్ అనే విద్యార్థి, తన తల్లి ఈ మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కు రాకపోవడంతో ఆరా తీసేందుకు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూడగా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. తల్లి కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతుండటం చూసి నిశ్చేష్టుడయ్యాడు.

అబ్బురపరిచిన సమయస్ఫూర్తి

అయితే దీక్షిత్ ఏమాత్రం భయపడకుండా వెంటనే ఆందోళననుంచి తేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచే సమయం లేదని, తక్షణం చర్య తీసుకోవాలని గ్రహించాడు. ప్రాణాపాయాన్ని గుర్తించిన దీక్షిత్, ఏమాత్రం ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా నేరుగా కరెంట్ సరఫరా అవుతున్న మోటార్ స్విచ్‌ను ఆపేశాడు. అనంతరం, కర్ర సాయంతో తల్లిపై పడి ఉన్న కరెంట్ వైర్‌ను చాకచక్యంగా తొలగించాడు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడింది. వెంటనే తల్లిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స చేసి అంతాబాగుందని పంపించారు. తన తల్లి క్షేమంగా ఉందని నిర్ధారించుకున్న దీక్షిత్, అనంతరం ఆమెను వెంటబెట్టుకుని పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌కు హాజరు కావడం విశేషం.

సూపర్ హీరో

దీక్షిత్ తన తల్లిని కరెంట్ షాక్ నుంచి కాపాడుకు ఘటన గురించి తెలుసుకున్న ఆ పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు బాలుడి ధైర్య సాహసాలను కొనియాడారు. కరెంట్ షాక్ చాలా ప్రమాదకరమైనదని, అటువంటి అత్యవసర పరిస్థితుల్లో పెద్దలు కూడా కంగారుపడతారని, కానీ దీక్షిత్ మాత్రం చిన్న వయసులోనే చూపిన తెగువ, సమయస్ఫూర్తి అత్యంత ప్రశంసనీయమని అభినందించారు. దీంతో దీక్షిత్ ఒక్కసారిగా జొన్నలగరువు గ్రామ 'సూపర్ హీరో'గా నిలిచాడు.

Read More
Next Story