నారావారిపల్లెకు సంక్రాంతి కళ తెచ్చిన సీఎం
x
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు..

నారావారిపల్లెకు సంక్రాంతి కళ తెచ్చిన సీఎం

సొంత ఊరికి చేరుకున్న చంద్రబాబు కుటుంబం. పండుగ ఎలా జరుపుకోనున్నారంటే..


సంక్రాంతి వేడుకల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం సాయంత్రం స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన కుటుంబీకులు, గ్రామస్తులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. కోట్ల రూపాయల అభివృద్థి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. గ్రామంలో సంక్రాంతి సంబరాలకు నారా చంద్రబాబు కుటుంబీకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

వినతులు స్వీకరించి..


నారావారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు హెలిపాడ్ నుంచి నివాసం వద్దకు రాగానే, సందర్శకులు వినతులతో సిద్ధంగా ఉన్నారు. సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్న తరువాత తన నివాసంలోకి వెళ్లారు.

సంక్రాంతి సంబరాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే. ప్రతి సంవత్సరం ఆయన కుటుంబ సమేతంగా సొంత ఊరికి రావడం అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నారావారిపల్లెకు భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ తో కలిసి హెలికాప్టర్ లో చేరుకున్నారు.

సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులు, గ్రామస్తులు, కార్యకర్తలు, నేతలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం సంబరాల్లో పాల్గొంటుంది. నారావారిపల్లెతో పాటు తిరుపతిలో మంగళవారం సుమారు పది కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించడం తోపాటు 133.94 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.

విజయవాడ నుంచి నారావారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ కు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. హెలిపాడ్ వద్ద తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తోపాటు జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో వారికి రాష్ట్ర యాదవ సంక్షేమం, అభివృద్ధి సంస్థ చైర్మన్ జీ. నరసింహ యాదవ్, టీడీపీ

తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ , తుడా చైర్మన్ డాలర్స్ దివాకరరెడ్డి తోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికారు.




నారావారిపల్లెలో శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

సంక్రాంతి సంబరాలకు సొంత ఊరు నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంగళవారం పాల్గొనే కార్యక్రమాలు ఇవి.
1) ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు.
2) మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళతారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు.
3) నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌,
రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
4) తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌ వర్చువల్ గా ప్రారంభిస్తారు.
5) ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ప్రారంభిస్తారు.
శంకుస్థాపనలు
6) చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు సమీపంలోని మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
7) రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు.
‘) ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
నాగాలమ్మకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాలకు హాజరయ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం నారావాపల్లె గ్రామదేవత నాగాలమ్మ గుడి వద్ద పూజలు చేయడం ఆనవాయితీ. ఈ నెల 15వ తేదీ గ్రామ దేవత నాగాలమ్మ గుడికి చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళ్లి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.
Read More
Next Story