గోవా క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం, 25 మంది సజీవ దహనం
x
Goa fire accident

గోవా క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం, 25 మంది సజీవ దహనం

ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు


ఉత్తర గోవాలోని అర్పోరాలోని ఒక నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గోవాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటైన బాగాలోని బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతులలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులతో సహా మొత్తం 25 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీజీపీతో సహా సీనియర్ పోలీసు అధికారులు, ఉత్తర గోవా జిల్లా నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

మృతుల్లో నలుగురు విదేశీ పర్యాటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తెలిపారు. మిగతావారంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు, వారంతా కిచెన్‌ సిబ్బంది అని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ఎక్కువమంది సిబ్బంది మరణించారని అన్నారు.
సిలిండర్‌ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్‌ లోబోతో కలిసి సీఎం ప్రమోద్‌ కుమార్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్‌ క్లబ్‌లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు చెప్పారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. అంతేకాకుండా ఈ క్లబ్‌ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్‌ సావంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్ట ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్‌ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్‌ లైసెన్స్‌లు రద్దుచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
Read More
Next Story