తిరుపతి: SFi నేతల కిడ్పాప్.. ప్రధాన నిందితులుగా తండ్రీ, కొడుకుపై కేసు
x
టాలీవుడ్ నిర్మాత మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు సినీ కథానాయకుడు మంచు విష్ణు

తిరుపతి: SFi నేతల కిడ్పాప్.. ప్రధాన నిందితులుగా తండ్రీ, కొడుకుపై కేసు

సినీ నిర్మాత మంచు మోహన్ బాబు, కొడుకు విష్ణు మళ్లీ వెంటాడిన కేసులు..


విద్యార్థి సంఘ నాయకుల పైన దాడి, కిడ్నాప్ చేసిన కేసులో సినీ నటుడు (Tollywood) కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు, సినీ కథానాయకుడు మంచు విష్ణు, విష్ణు పీఆర్వో సతీష్ పై తిరుపతి లో కిడ్నాప్ కేసు నమోదయింది. ఈ సంఘటనలో మంచు మోహన్ బాబు (A2), మంచు విష్ణుబాబు (A3), విష్ణు పీఆర్వో సతీష్ ((A1) తోపాటు 20 మందిపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

"కిడ్నాప్ కు గురైన ఎస్ఎఫ్ఐ నాయకులను సురక్షితంగా తీసుకొని వచ్చాం. నిందితుల పైన కేసులు నమోదు చేశాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చెప్పారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట వద్ద మోహన్ బాబు యూనివర్సిటీ (MBU ) ఉంది. ఈ యూనివర్సిటీ tollywood హీరో మంచు మోహన్ బాబు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
"మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అక్రమాల పైన విచారణ జరపండి. విద్యార్థులకు న్యాయం చేయండి" అని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) జిల్లా కార్యదర్శి అక్బర్, ఆ సంఘం మరో కార్యదర్శి ప్రవీణ్ డిమాండ్ చేశారు.
"మోహన్ బాబు యూనివర్సిటీ లో జరిగే అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసాం. స్పందన లేదు" అని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ ఆరోపించారు. ఫీజుల పేరుతో పేద విద్యార్థుల నుంచి కూడా వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా గతంలో వినతిపత్రాలు సమర్పించినట్లు ఆయన చెప్పారు.
ర్యాలీ నిర్వహిస్తుంటే
మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీ వద్ద మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేయడానికి కార్యక్రమం ఖరారు చేశారు. తిరుపతి నగరంలో పోలీస్ 30 యాక్ట్ ఉండడం వల్ల పోలీసుల సూచనల మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించాలని కార్యక్రమం వేదిక మార్చారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్న తిరుచానూరుకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతో కలిసి వెళుతుండగా మోహన్ బాబు విశ్వవిద్యాలయం మద్దతుదారులు కొందరు ర్యాలీపై దాడి చేశారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి అక్బర్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విభాగం ఎస్ఎఫ్ఐ నాయకుడు వినోద్ ను కిడ్నాప్ చేశారు.

ఈ సమాచారం అందుకున్న సిపిఎం రాష్ట్ర నాయకుడు కందారపు మురళి, సీపీఐ రాష్ట్ర నేత ఏ. రామనాయుడు, వామపక్ష విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నేతలతో కలిసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ సమీపంలో నిరసనకు దిగారు.

అదే సమయంలో తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు కూడా సమాచారం అందించారు.
గంట వ్యవధిలో ఆచూకీ

విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేశామరనే సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు స్పందించారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
"నారావారిపల్లె సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో ఎస్ఎఫ్ఐ నాయకులను నిర్బంధించి ఉన్నట్లు గుర్తించాం. బాధితులను గంటలో రక్షించి, నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.
విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసిన వారి వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
"విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసిన నిందితులతో పాటు వారితో ఆ పని చేయించిన వారిపై కూడా కేసులు నమోదు చేశాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిని వదిలే ప్రసక్తి ఉండదని ఆయన హెచ్చరించారు.

మోహన్ బాబుకు మళ్ళీ కష్టాలు..

సినీ నిర్మాత మంచు మోహన్ బాబు, ఆయన కుటుంబం ఏడాది నుంచి ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్లో చోటు చేసుకున్న అనేక పరిణామాలు తెలిసింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని నివాసం వద్ద వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన వీడియో జర్నలిస్టు నుంచి మైక్ లోగో లాక్కొని మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేసులో కోర్టు వ్యవహారాలను పక్కన ఉంచితే..

తిరుపతిలో మళ్లీ కష్టాలు..

చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు సమీపంలోని రంగంపేట వద్ద మోహన్ బాబు యూనివర్సిటీ MBu సినీ నిర్మాత మోహన్ బాబు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ అధిక ఫీజుల తో విద్యార్థులను దోచుకుంటున్నాడని ఆరోపిస్తూ నిరసనలకు దిగిన ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయడం, కార్యకర్తలపై దాడి జరిగిన ఘటన నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో..
A1 - Satheesh (మంచు విష్ణు పీఆర్వో)
A2 - mohan babu (సీనీ నిర్మాత
A3 - Manchu Vishnu Babu (మోహన్ బాబు యూనివర్సిటీ డైరెక్టర్) తోపాటు 20 మందిపై దాడి, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. వారిపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో Cr. No. 23/2026 U/s 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చెబుతున్నారు.

రుయా ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న అక్బర్, వినోద్ పరామర్శిస్తున్న కందారపు మురళి, నేతలు

సినీ నిర్మాత మంచు మోహన్ బాబు మద్దతుదారుల దాడికి గురైన ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ ను తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న వారిని సీపీఎం నేత కందారపు మురళీ తోపాటు వివిధ సంఘాల నేతలు పరామర్శించారు.
Read More
Next Story