తిరుమల శ్రీవారి యాత్రికులను చిరుత పులుల తో పాటు పాములు కూడా భయపెడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వెళుతున్న తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు
భూపాల్ పల్లి ప్రాంతానికి చెందిన మౌనిక (27) ఆదివారం పాము కాటుకు గురైన సంఘటన కలకలం రేపింది. సోమవారం ఈ విషయం బయటికి తెలిసింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (Svims) ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రమాదం లేదనే డాక్టర్ల సూచనతో సోమవారం ఉదయం శరత్ బాబు, మౌనిక దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
"వరంగల్ కు చెందిన మౌనిక యాత్రికురాలికి మ్యూజియం ప్రాంతంలో పాముకాటుకు గురైంది. క్యూలో కాదు" అని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
"ఆ పాముతో ప్రమాదం లేదు. ఆమెకు విషం ఎక్కే సమస్య లేదు" అని టిటిడి స్నేక్ క్యాచర్ (పాములు పట్టే వ్యక్తి) భాస్కరనాయుడు చెబుతున్నారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చి..
శ్రీవారి దర్శనం కోసం మిగతా యాత్రికుల మాదిరే తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లికి చెందిన మౌనిక (27) దంపతులు తమ కూతురుతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. రూ. 300 టికెట్ ఉన్న మౌనిక దంపతులు తిరుమలలోని ఏటీసీ సర్కిల్ సమీపంలో ఉన్న క్యూలైన్ లోకి వెళ్ళడానికి వేచి ఉన్నారు. ఈ ప్రవేశమార్గానికి సమీపంలోనే ఆళ్వార్ ట్యాంక్ (పెద్ద నీటి కొలను) నీటితో కళకళలాడుతూ ఉంది. టిటిడి ఉద్యానవన విభాగం నిర్వహణలోని పూల చెట్లు అడవిమొక్కల పొదల నుంచి ఓ పాము రావడంతో కలకలం చెలరేగింది. ఈ ఆందోళనలో మౌనిక ఆ పాముపై కాలు వేయడంతో కాటు వేసినట్లు టీటీడీ ఉద్యోగుల ద్వారా తెలిసిన సమాచారం.
ఆందోళన.. కలకలం..
పాము కాటు వేయడంతో భయపడి పోయిన మౌనిక ఆందోళనకు గురైంది. యాత్రికులలో కలకలం చెలరేగింది. వెంటనే స్పందించిన అక్కడ విధుల్లో ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది మౌనికను వెంటనే తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే టిటిడి అదన ఈఓ వెంకయ్య చౌదరి స్పందించారు. బాధితురాలు మౌనికకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలో టిటిడి నిర్వహిస్తున్న స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
"మౌనిక ఆరోగ్యానికి ప్రమాదం లేదు. చికిత్స చేస్తున్నాం. కోలుకుంటోంది" అని సిమ్స్ ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై టీటీడీలో స్నేక్ కేచరుగా ఉన్న భాస్కర్ నాయుడు ఏమంటున్నారంటే..
"ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న పొదల నుంచి ఈ పాము వచ్చినట్లు అక్కడ సిబ్బంది ద్వారా తెలిసింది. ఈ పాము కాటుతో ప్రాణాపాయం జరగదు. భయపడాల్సిన అవసరం లేదు" అని స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చెప్పారు.
ఏనుగుపాముగా భావించే సర్పం ఆమెను కాటేసింది. ఇది విషతుల్యం కాదు. సాధారణంగా పల్లెల్లో ఎడ్లముక్కులోకి ఒక రకమైన పాములు పోలిన కీటకాలు వెళుతూ ఉంటాయి. ఈ ఏనుగు పాము కూడా ఆ కోవకు చెందినది" అని భాస్కర్ నాయుడు చెప్పారు. ఏనుగు పాములు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయని ప్రస్తుతం మౌనికను కాటు వేసిన పాము నలుపు రంగులో ఉంటుంది దీని వల్ల ప్రమాదం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు.
రంగంలోకి ఉద్యానవన విభాగం
తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లికి చెందిన మౌనికను పాము కాటు వేసిన సంఘటనతో టిటిడి ఉద్యానవన విభాగం సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఏటీసీ సర్కిల్ తో పాటు ఆలయ పరిసరాల్లోని పొదలను శుభ్రం చేసే పనులు చేపట్టారు.
"మౌనికను కాటు వేసిన ఏనుగు పాము జాతికి చెందిన పామును చంపేశారు" అనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చెప్పారు. ఆ పామును చూసిన తర్వాతనే ప్రమాదం లేదనే విషయాన్ని తనకు అర్థమైందని ఆయన చెబుతున్నారు.
టీటీడీ కథనం ఇదీ...
"తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకున్నారని, మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లింది" అని TTD స్పష్టం చేసింది. కాలుపై స్పర్శ తగలడంతో భయబ్రాంతులకు లోనై, తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించిందని తెలిపారు. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో ఆమెను తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాము కాటు లేదని నిర్ధారించారని వివరించారు. అయినా మహిళా భక్తురాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారని టీటీడీ వివరణ ఇచ్చింది. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలడంతో సోమవారం ఉదయం వారు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది.
తిరుమల అడవులు
తిరుమల శేషాచలం కొండలు సముద్రమట్టానికి 853 మీటర్లు (2,799 అడుగులు) ఎత్తులో ఉంటాయి. భౌగోళికంగా తిరుమల క్షేత్రం 10.33 స్క్వేర్ మీటర్స్ (26.75 కిలోమీటర్లు) పరిధిలో విస్తరించి ఉంది. 2007లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో జీవో నెంబర్ 108 విడుదల చేసింది.
"ఆ జీవో ప్రకారం తిరుమల లోని శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి" అనేవి ఏడుకొండలుగా ప్రస్తావించారు. 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఏడుకొండల ప్రాంతాన్ని పవిత్రమైన క్షేత్రం గా గుర్తించారు. తిరుమలలో రెండు కొండలు అనే రాజకీయ వివాదం నేపథ్యంలో సర్వత్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ జీవో జారీ చేయడానికి ఆస్కారం కల్పించింది. ఈ ప్రస్తావన ఎందుకంటే..
అడవులు చదును చేసి..
తిరుమల శ్రీవారి ఆలయం వెనుక ప్రాంతం, గోగర్భం డాం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంగా ఉన్న మ్యూజియం వద్ద, రింగ్ రోడ్ లో సహజల ప్రాంతం వరకు అడవులను తొలగించడం ద్వారా కాంక్రీట్ భవనాల నిర్మాణం జరిగింది.
తిరుమలకు వెళ్లడానికి అలిపిరి నడక మార్గంతో పాటు శ్రీవారి మెట్టు నుంచి వచ్చే కాలినడక యాత్రికులు కూడా దట్టమైన అడవి వదల నుంచే శ్రీవారి క్షేత్రం లోకి పాదం మోపాలి. ఈ విషయాలు ఎందుకు అంటే,
"అరుదైన జంతువులు, వృక్షాలకు, కీటకాలకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న తిరుమల లో విష సర్పాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. తరచూ, యాత్రికులు బస చేసే అతిథి గృహాల సమీపంలోకి రావడం సర్వసాధారణం"
విష సర్పాలు వస్తే వెంటనే టీటీడీ అటవీ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన భాస్కర్ నాయుడు రంగ ప్రవేశం చేస్తారు. చాకచక్యంగా ఆ పాములు పట్టుకుని అడవిలో వదలడం ఆయన విధి. ఇప్పటికి రెండుసార్లు విషనాగుల కాటుకు గురైన భాస్కరనాయుడు కోలుకున్న తర్వాత మళ్లీ అదే పని నిర్వహిస్తున్నారు. టీటీడీలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన తిరుమల లేదా తిరుపతిలో ఆలయాల వద్ద ఎక్కడ ప్రాము కనిపించినా, భాస్కర్ నాయుడుకు సమాచారం అందుతుంది. వెంటనే ఆ పామును పట్టి శేషాచలం దట్టమైన అడవుల్లో సురక్షితంగా వదలడానికి ఆయనకు టిటిడి 1000 రూపాయలు చెల్లిస్తుంది.
తిరుమలలో సోమవారం ఉదయం సంఘటన జరిగినప్పుడు కూడా తాను మరో ప్రదేశంలో ట్యాంక్ వద్ద పాము వస్తే పట్టుకొని అడవిలో ఉండడానికి తీసుకొని వెళుతున్న అని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
తిరుమలలో మాడవీధులకు వెనుక ఉన్న ఏటీసీ సర్కిల్ ఒకటే కాదు చుట్టూ దట్టమైన అడవులే విస్తరించి ఉన్నాయి. తరచూ పాములు రావడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. వాటి వల్ల యాత్రికులకు ప్రాణహానే లేని రీతిలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని టిటిడి అదనపు ఈవో వెంకయ్య నాయుడు చెబుతున్నారు.