తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వార్షిక తెప్పోత్సవాలు కనువిందు చేయనున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆర్జితసేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. తెప్పోత్సవాలకు సోమవారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పల సామర్ధ్యాన్ని పరీక్షించారు.
తిరుమల శ్రీవారి పుష్కరిణి వద్ద టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తరువాత పూజలు చేయడం ద్వారా తెప్పల సామర్థ్యాన్ని పరిశీలించారు. శ్రీవారి పుష్కరిణి నీటిలో తెప్పలపై అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో పాటు అధికారులు విహరిస్తూ, సామర్థ్యాన్ని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.
"శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేశాం. ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యం పరిశీలించాం" అని వెంకయ్య చౌదరి తెలిపారు. ఆయన వెంట ట్రయల్ రన్లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఈఈలు శ్రీనివాసరావు, సుధాకర్, డిఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు ఉన్నారు.
తిరుమలలో తెప్పోత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంది. క్రీస్తు శకం 1468లోనే
సాళువ నరసింహరాయలు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో నీరాళీ మండపం నిర్మించి, తెప్పోత్సవాలకు అవసరమైన విధంగా తీర్చిదిద్దారనేది కథనం. 15వ శతాబ్దానికి చెందిన కాలంలో పదకవితా పితామహుడు
తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను కీర్తించారు. వేసవికాలం ప్రారంభానికి ముందు పున్నమి వెన్నెలలో ఉభయ దేవేరులతో శ్రీవారి ఉత్సవామూర్తులు పుష్కరిణిలో విహరించే అరుదైన సన్నివేశం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది.
తెప్పోత్సవాల్లో శ్రీవారి సేవలు ఇలా..
శ్రీవారి పుష్కరిణిలో గురువారం సాయంత్రం నుంచి తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఒకో రోజు ఒక అవతారంలో శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పలపై విహరిస్తూ, యాత్రికులకు దర్శనం ఇస్తారు. దీనికి కూడా ఓ సంప్రదాయం పాటిస్తారు. మొదటి మూడు రోజులు స్వామివారు పుష్కరిణిలో మూడుచుట్లూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. నాల్గవరోజు ఐదుసార్లు, చివరి రోజు మాత్రం ఏడుకొండలకు గుర్తుగా ఏడుసార్లు పుష్కరిణిలో దేదీప్యమానంగా వెలిగే కాంతుల మధ్య ఏడుచుట్లు విహరించడానికి ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వివరించారు.
26వ తేదీ మొదటి రోజు తెప్పలపై నీటిలో శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి విహరిస్తారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు.
సేవలు రద్దు..
తిరుమలలో వార్షిక తెప్పోత్సవాల (Raffles Festival ) నేపథ్యంలో కొన్ని సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి ఒకటో తేదీ నుంచి రెండు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.