
నెల్లూరు: తండ్రి భతికకాయం వద్ద రోదిస్తున్న ఇంటర్ విద్యార్థి రామ్ సాయి
ఇంట్లో తండ్రి మృతదేహం.. 'ఇంటర్'విద్యార్థికి అగ్ని'పరీక్ష'
నెల్లూరులో కన్నీరు పెట్టించిన విషాద ఘటన.
పేద కుటుంబం. భవిష్యత్తుకు పునాది వేసే ఇంటర్ పరీక్షలు. రాత్రంతా ప్రశాంతంగా చదువుకున్నాడు. కొడుకా.. పరీక్ష బాగా రాయి. అంతా మంచే జరుగుతుందని తండ్రి ప్రోత్సహించే మాటలు చెప్పాడు. ఇంకొన్ని గంటల్లో పరీక్ష ప్రారంభమవుతుంది. ఆదివారి రాత్రి తండ్రి గుండెపోటుతో మరణించాడు. విధి ఆడిన వింత నాటకం ఇంటర్ విద్యార్థి కందల రాంసాయికి అగ్నిపరీక్ష గా మారింది. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్న విషాద ఘటన ఇది. బంధువులనే కాదు. కాలనీవాసులు కూడా కన్నీరు పెట్టించింది. ఆ వివరాలు ఇవి.
నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని కందుల శివకుమార్ కొడుకు రాంసాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షకు హాజరు కావాలి. ఆదివారం మధ్యాహ్నం కూడా సరదాగా మాట్లాడిన తండ్రి కందల శివకుమార్ గుండెపోటుతో సాయంత్రం ఆకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. పరీక్షపై దృష్టి నిలిపిన రాంసాయి తల్లడిల్లాడు. గుండెపోటుతో ప్రాణాలు వదిలిన తండ్రి భౌతికకాయం ఒకపక్క. పరీక్షకు హాజరయ్యేందుక సమీయం మరోపక్క సమీపిస్తుంది. భవిష్యత్తుకు పునాది వేసే పరీక్షకు హాజరు కావాలా? ఏమి చేయాలనేది తేల్చుకోలేని స్థితిలో విధి ఆడిన వింత నాటకంతో అగ్నిపరీక్ష ఎదురైంది.
బంధువుల ఓదార్పు..
తండ్రి శివకుమార్ ఆకస్మిక మరణంతో తల్లడిల్లుతున్న రాంసాయిని బంధువులు సముదాయించారు. ధైర్యం చెప్పారు. మనసు స్థిమితం చేసుకోమని ఊరడించారు. పరీక్షకు వెళ్లడానికి సన్నద్ధం కావాలని సిద్ధం చేశారు. ఇంట్లో తండ్రి శివకుమార్ మృతదేహాన్ని అలాగే ఉంచారు. ఆయన కొడుకు రాంసాయిని సోమవారం ఉదయం బైక్ పై ఎక్కించుకున్న బంధువులు సంగం మండల కేంద్రంలోని పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళ్లారు. దారి పొడవునా కన్నీటిధారలతో తల్లడిల్లుతున్న రాంసాయిని ఓదార్చడం బంధువులకు కూడా సాధ్యం కాలేదు.
ఉపాధ్యాయుల ఎదురుచూపు..
తమ కాలేజీ విద్యార్థి రాంసాయి కి ఎదురైన అగ్నిపరీక్ష అధ్యాపకులకు తెలిసింది. సహచర విద్యార్థులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ నిరీక్షిస్తూ కాలేజీ వద్ద కనిపించారు. బంధువులతో కలిసి బైక్ పై వచ్చిన రాంసాయి స్థితిని చూసిన విద్యార్థులు కూడా కన్నీరు కార్చారు. పరీక్ష సమయానికి ముందే కేంద్రం వద్దకు తీసుకువచ్చిన బంధువులు రామసాయిని తరగతి గదిలోకి పంపించారు. ఈ హృదయ విధారక సన్నివేశాన్ని చూసిన తోటి విద్యార్థులే కాకుండా అధ్యాపకులు కూడా తల్లడిల్లిపోయారు. ఇంటిలో తండ్రి భౌతిక కాయాన్ని అలాగే ఉంచి, రాయడానికి వచ్చిన విద్యార్థి రామసాయిని కాలేజీ అధ్యాపకులు అక్కున చేర్చుకున్నారు. మండుతున్న గుండెల్లో నుంచి ఉబుక్కుతున్న వేదన, కన్నీటిని పంటి బిగువున దిగుబట్టిన రాంసాయి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసి ఇంటికి వెళ్లాడని అక్కడి అధ్యాపకుల ద్వారా తెలిసింది.
Next Story

